వెల్దండ: పశువులకు సోకుతున్న సీజనల్ వ్యాధుల నుంచి రైతులు పశువులను కాపాడుకోవాలని రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని బండోనిపల్లి, గుండాల గ్రామాల్లో రాష్ట్ర నోడల్ అఫీసర్ అనిల్‌కుమార్ జిల్లా పశువైద్యాధికారి జ్ఞానశంకర్‌తో కలిసి గాలికుంటు నివారణ టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిపశువుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో పాడి ఆవులను నీడలో ఉండే విధండా చూసుకోవాలన్నారు. ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లి మధ్యాహ్నం వరకు నీడకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నివారణ టీకాలను ముందస్తుగా పశువులకు వేయించాలని రైతులకు సూచించారు. అలాగే వైద్య సిబ్బంది ముందురోజు గ్రామాల్లో దండోరా వేయించి.. రైతులకు సమాచారం అందించాలన్నారు. ఈ నెల 9 వరకు టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని పశువులకు టీకాలు వేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, సిబ్బంది నరేష్‌రెడ్డి, నర్సింహ, తిరుపతయ్య, శ్రీను, గోపాలమిత్రలు తదితరులు పాల్గొన్నారు.


