
బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి
నాగర్‌కర్నూల్: జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలుచేయాలని.. తహసీల్దార్లు ఉదయం 10:30 గంటలలోగా కార్యాలయానికి హాజరు కావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్‌తో కలిసి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ఆర్డీఓలతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లతో భూ భారతి, ప్రజావాణి అర్జీలు, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా, మీసేవ దరఖాస్తులు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను శుక్రవారంలోగా సమర్పించాలన్నారు. భూములు రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్ బుక్ చేసిన వారికి అదే రోజు రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని.. తహసీల్దార్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ తహసీల్దార్‌ను ఇన్‌చార్జిగా నియమించాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా సాదాబైనామాల సంఖ్య, వాటి ప్రస్తుత స్థితి, చట్టపరమైన సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. మీసేవ ద్వారా ఆదాయ, కుల, రెసిడెన్షీ వంటి సర్టిఫికెట్ల జారీ పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే ఆమోదం తెలపాలని సూచించారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది అనధికారికంగా విధులకు గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓలు జనార్దన్‌రెడ్డి, భన్సీలాల్, సురేశ్‌బాబు, మాధవి, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు రవికుమార్, వెంకట్, శోభ ఉన్నారు.
● రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను పక్కాగా రూపొందిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై మంగళవారం వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బుధవారం తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 460 గ్రామపంచాయతీలకు గాను 214 ఎంపీటీసీ, 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 1,224 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 6,47,342 ఓటర్లు ఉన్నారని.. వీరిలో 3,23,015 మంది పురుషులు, 3,24316 మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎంల గోదామును కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దేవసహాయం, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్ ఉన్నారు.
ప్రజావాణికి వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఆయన ప్రజల నుంచి 65 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
తహసీల్దార్లు సకాలంలో విధులకు హాజరు కావాలి
భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలి
కలెక్టర్ బదావత్ సంతోష్