
ఏసీబీ వలలో అవినీతి అధికారి
మద్దూరు: మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టు బడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. మద్దూరు మండలం రెనివట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు తన 5 గుంటల భూమి డీఎస్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆర్‌ఐ కె.అమర్‌నాథ్‌ను సంప్రదించగా.. రూ. 5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రైతు నుంచి ఆర్‌ఐ డబ్బులు తీసుకొని మహబూబ్‌నగర్‌కు కారు లో వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ కార్యాల యం ఎదుట పట్టుకొని తనిఖీ చేశామన్నారు. రైతు నుంచి తీసుకున్న లంచం డబ్బులను రికవరీ చేసి ఆర్‌ఐని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, సయ్యద్ అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు.
రైతు నుంచి రూ. 5వేల లంచంతీసుకుంటూ పట్టుబడిన మద్దూరు ఆర్‌ఐ