
ఎర్ర చెల్క భూములు పేదలకు పంచాలి
తెలకపల్లి: ఎర్రచెల్క భూములను పేదలకు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని గడ్డంపల్లిలో కామ్రేడ్ లింగోజీరావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్వతాలు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో లింగోజీరావు పాత్రం మరవలేనిదన్నారు. గడ్డంపల్లిలో పేదలకు భూములు పంచాలని పెద్దఎత్తున ఉద్యమించి.. 400 ఎకరాల భూమిని పంపిణీ చేయించారని గుర్తుచేశారు. పేదల కోసం అనునిత్యం పరితపించే నాయకుడు అని కొనియాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. రజాకారు లాంటి సినిమాలు తీసుకొచ్చి మతం రంగు పులుముతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్ తరాలు తెలంగాణ పోరాటాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కామ్రేడ్ లింగోజీరావు స్ఫూర్తితో గడ్డంపల్లిలో ఉన్న ఎర్రచెల్క భూములు పేదలకు పంచేందుకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అర్.శ్రీనివాసులు, మండల కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్, నాయకులు మధు, జగదీశ్, విజయగౌడ్, బుచ్చన్న, మల్లయ్య, తిరుపతి, నిరంజన్ పాల్గొన్నారు.