
ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం..
సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో చోట రూ.వంద చొప్పున.. ఒక్కొక్కరికి మొత్తం రూ.300 ఖర్చు అవుతుంది. బోటు నుంచి ఆటో, ఆటో నుంచి మళ్లీ బోటుకు మారి ప్రయాణించేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.