కల్వకుర్తిని సుందరంగా తీర్చిదిద్దుతాం
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని.. మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకొచ్చి సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో సుమారు రూ. 6కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కల్వకుర్తి అభివృద్ధి కోసం రూ.కోట్ల నిధులు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్నారని తెలిపారు. పట్టణంలోని కూడళ్లను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారని.. త్వరలోనే వాటికి కూడా శంకుస్థాపనలు చేస్తామన్నారు. కొన్నేళ్లుగా నిరాధరణకు గురైన ఈదుల చెరువును తీర్చిదిద్దేందుకు గాను రూ. 2.20 కోట్ల నిధులు అమృత్ 2.0 కింద మంజూరు చేయించినట్లు వివరించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరానగర్ కాలనీ ముఖద్వారం వద్ద నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా.. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రంగన్న, కాంగ్రెస్ నాయకులు ఆనంద్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


