ప్రాణాలతో చెలగాటం

- - Sakshi

జిల్లాలోని ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌ల దందా

తప్పుడు రిపోర్టు..

జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌లో స్కానింగ్‌ చేయించుకుంటే డాక్టర్‌ తప్పుడు రిపోర్టు ఇచ్చారు. బాబు పుట్టిన తర్వాత అనారోగ్యానికి గురైతే హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తిరిగాం. చికిత్స కోసం రూ.8 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుడి తీరుపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకుంటలేరు. – సరిత,

జిల్లాలోని అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌కు చెందిన గర్భిణి సరిత అచ్చంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెకప్‌ కోసం వెళ్లింది. అక్కడి వైద్యురాలు స్కానింగ్‌ కోసం జిల్లాకేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు రెఫర్‌ చేసింది. జిల్లాకేంద్రంలోని సదరు స్కానింగ్‌ సెంటర్‌ రేడియాలజిస్టు గర్భంలోని శిశువు గుండెకు సంబంధించిన రెండు జఠరికలు నార్మల్‌గానే ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. అయితే శిశువు జన్మించిన తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. పుట్టిన శిశువు గుండెకు ఒకే జఠరిక ఉన్నట్టు నిమ్స్‌ వైద్యులు నిర్ధారించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక పుట్టిన శిశువు పది నెలలకే మరణించింది. అయితే స్కానింగ్‌ కోసం వస్తే తప్పుడు రిపోర్టు ఇచ్చి నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ, పోలీస్‌ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా వెలసిన ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌ల దందా అడ్డగోలుగా సాగుతోంది. రోగుల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను నడిపిస్తూ.. వాటి నిర్వహణకు అవసరమైన ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదు. జిల్లాలోని చాలా వరకు డయాగ్నోస్టిక్‌, ల్యాబ్‌ సెంటర్లలో ఒకరి పేరిట అనుమతులు పొంది.. మరొకరితో పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరిలో చాలామంది అర్హత లేని వారితో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న వరుస ఘటనలపై బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

మన్ననూర్‌,

అమ్రాబాద్‌ మండలం

నిర్ణీత ప్రమాణాలు

పాటించకుండా నిర్వహణ

ఒకరి పేరిట అనుమతి.. మరొకరితో ఏర్పాటు

తప్పుడు రిపోర్టులతో ప్రాణాల మీదకు..

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం

నోటీసులు ఇచ్చాం..

ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంపై మాకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని సంబంధిత వైద్యులకు నోటీసులు ఇచ్చాం. పోలీసు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు వీలుగా సంబంధిత స్కానింగ్‌ రిపోర్టులపై మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్ల అభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించాం. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల పనితీరుపై వచ్చే ఫిర్యాదులపై స్పందించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సుధాకర్‌లాల్‌, డీఎంహెచ్‌ఓ

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top