86,736 మందికి..
● నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి
పెట్టుబడి సాయం
● రెండు విడతల్లో రూ.104.38 కోట్లు జమ
28వ తేదీలోపు
దరఖాస్తు చేసుకోవాలి
ఈనెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమచేయనుంది. జిల్లా వ్యాప్తంగా నూతనంగా పట్టాదారుపాస్‌బుక్‌లు పొందిన రైతులతో కలిపి సుమారుగా రూ.111 కోట్ల వరకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రెండు విడతల్లో అందించనుంది. కొత్తగా పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులు ఈ నెల 28లోగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.
– సురేశ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
ములుగు: రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రబీ సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం అందక నిరాశలో ఉన్న అన్నదాతలకు నేటి (ఆదివారం) నుంచి రైతు భరోసా డబ్బులను ఖాతాల్లో జమచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతాంగానికి పెట్టుబడి సాయం అందించడంతో కొంత జాప్యం జరిగింది. దీంతో పెట్టుబడి సాయంపై ఏర్పడిన అనిశ్చితికి తెరదించుతూ ఈ నెల 22 నుంచి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.104.38 కోట్లు
జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 86,736 మంది రైతులు రబీ సీజన్‌లో 1,73,970 ఎకరాలు సాగు చేస్తుండగా, ఎకరానికి ఆరు వేల చొప్పున రూ.104.38 కోట్ల పెట్టుబడి సాయం రైతు ఖాతాల్లో ప్రభుత్వం రెండు విడతల్లో జమచేయనుంది. గత యాసంగిలో పెట్టుబడి సాయం రాకపోవడంతో ఈసారి కూడా ప్రభుత్వం మొండిచేయి చూపుతుందని భావించినప్పటికీ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగానే రైతులకు భరోసా డబ్బులు అందించడంలో జాప్యం జరిగిందని అధికార యంత్రాంగం పేర్కొంటుంది. రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రెండు విడతల్లో రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని అందించనుంది. మొదటి విడతగా ఈ నెల 22 నుంచి పెట్టుబడి సాయాన్ని అందించనుండగా, ఏప్రిల్ రెండో వారంలో రెండో విడత డబ్బులను జమచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కొత్తవారికి అవకాశం
2025–26 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన రైతులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. కొత్తగా 1,400 మంది రైతులు పట్టాదారు పాస్‌బుక్‌లు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో సుమారు 11 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేయగా, వారికి పెట్టుబడి సాయం కింద రూ.6.60 కోట్లను ప్రభుత్వం రెండో విడతలో జమచేయనుంది.


