రాష్ట్ర బడ్జెట్
2026–2027
బడ్జెట్‌లో అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
ఓరుగల్లుకు కీలకంగా 10 ప్రాజెక్టులు...
జరగని ప్రత్యేక కేటాయింపులు..
కొత్తగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. అయితే బడ్జెట్ (ప్రగతి పద్దు)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించారు. ప్రధానంగా వరంగల్ నగరాభివృద్ధి, ఉన్నతవిద్య, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపించింది. అయితే, కీలకమైన 10 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించినా.. ప్రత్యేకంగా కేటాయించే నిధులను ప్రస్తావించలేదు. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్కు, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఐటీ టవర్, రింగ్‌రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జాతీయస్థాయి యూనివర్సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, టూరిజం సర్క్యూట్‌కు ప్రత్యేక కేటాయింపులు లేకన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్ స్మార్ట్‌సిటీకి గత బడ్జెట్‌లో రూ.156.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సహాయం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. పథకం కింద వరంగల్ స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.44,137.02 లక్షలు కేటాయించారు.
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు
● కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు
● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు
● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం..
ఆరు గ్యారంటీలకు ఆదరణ
● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీట
సాక్షిప్రతినిధి, వరంగల్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్‌టైల్ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్‌లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్‌గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్‌కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


