రైతు వేదికల వివరాలు
మూడేళ్లకు పైగా రైతు వేదికల నిర్వహణకు అందని డబ్బులు
గోవిందరావుపేట: అన్నదాతలకు పంటల సాగులో సలహాలు, సూచనలు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు వేదికలను నిర్మించింది. జిల్లాలోని 10 మండలాల్లో మొత్తం 31 రైతు వేదికలు ఉండగా మూడేళ్లకు పైగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధి కారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిలిచిన మెయింటెనెన్స్ నిధులు
రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసే మెయింటెనెన్స్ నిధులు 2022 ఆగస్టు నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు మూడేళ్లకు పైగా ఒక్క రూపాయి కూడా బిల్లులు రాకపోవడంతో నిర్వహణలో అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెలవారీగా పత్రీ నెలా సమారుగా రూ. 8వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు, శుభ్రత, చిన్నపాటి మరమ్మతులకు సంబంధించిన ఖర్చులు సైతం భరించాల్సి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు.
నెలకు రూ.8వేల నుంచి 9వేల వరకు..
ప్రారంభంలో ప్రతీ రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ.3వేల చొప్పున నిధులు కేటాయించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు విన్నపం మేరకు ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.8 వేలు, మరికొన్ని చోట్ల రూ.9 వేలకు పెంచింది. అయితే 2022 ఆగస్టు నుంచి నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. ఫలితంగా వేదికల్లో నిర్వహించే శిక్షణ, సమావేశాలు తగ్గిపోయాయి. ఇతర కనీస అవసరాల కోసం సొంత డబ్బులు చెల్లించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాదికారులు స్పందించి, పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసి రైతు వేదికలను పూర్వ వైభవానికి తీసుకురావాలని కోరుతున్నారు.
రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. విద్యుత్, తాగునీటి బిల్లులు, స్వీపర్ ఖర్చులకు సొంతంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. నిధులు రాక పోవడంతో రైతు వేదికల్లో జరిగే కార్యక్రమాల నిర్వహణకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాము.
– వి.సురేశ్‌కుమార్, డీఏఓ
ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ అధికారులు
రైతులకు అందని సేవలు


