గోవిందరావుపేట: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని, స్వచ్ఛమైన ప్రాణవాయువుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా అటవీశాఖ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అడవుల సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాగా ములుగు ప్రథమ స్థానంలో ఉందన్నారు. పంటలు సమృద్ధిగా పండాలన్నా, సరిపడా వర్షపాతం నమోదు కావాలన్నా అడవులే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అడవిని సంరక్షంచడంలో అటవీ శాఖ అధికారులతో పాటు స్థానికులు సహాయ సహకారాలు అందించినప్పుడు అడవుల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రకృతి రమణీయతకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అనంతరం డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ మాట్లాడుతూ అడవుల సంరక్షణే ధ్యేయంగా అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. వైల్డ్‌లైఫ్ అభయారణ్యంలో బ్లాక్‌బెర్రీ, ఐలాండ్, ఎస్‌ఎస్ తాడ్వాయి హట్స్, జంగిల్ సఫారీ, బందాల వ్యూ పాయింట్ వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని వివరించారు. అనంతరం మంత్రి సీతక్క పస్రాలో రూ.35లక్షల నిధులతో రాజీవ్ కాలనీకి అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కలెక్టర్, డీఎఫ్‌ఓతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రేగ కల్యాణి, కేశవ్, వజ్రారెడ్డి, రమేష్, భూక్య సుమలత, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
శాఖ మంత్రి సీతక్క


