సమస్యలు ఇలా..
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా బదిలీ కావడంతో ఐటీడీఏ పీఓగా కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించడంతో సోమవారం ఐటీడీఏలో గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్జిదారులు ఐటీడీఏకు భారీగా తరలివచ్చారు. గిరిజన దర్బార్‌లో 130, ప్రజావాణిలో 52 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ఎస్‌డీసీ కోర్టు నిర్వహణ చేపట్టడం జరుగుతుందన్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గిరిజనులు ప్రధానంగా తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, కొత్త బోర్‌వెల్‌ల ఏర్పాటు, వ్యవసాయ భూముల్లో బోర్ వెల్స్ ఏర్పాటు వంటి అంశాలపై అర్జీలను సమర్పించారు. భూ వివాదాల పరిష్కారానికి ఎస్‌డీసీ కోర్టును వారానికి నాలుగు రోజులు మంగళ, బుధ, గురు, శుక్రవారాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుతుందన్నారు. ప్రజలు కోరిన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి హామీ పథకం నిధులు, ఇతర నిధులను ఉపయోగిస్తూ ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, ఎస్‌డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్, ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. సర్వే చేసి అర్హులుగా ప్రకటించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఇల్లు రాకుండా పోయింది. ఇల్లు వచ్చేలా చూడాలి. అద్దె ఇంటిలో ఉంటున్నాం. అధికారులు స్పందించి ఆదుకోవాలి.
– పున్నం రుక్మిణిదేవి,
సూరవీడు, వెంకటాపురం(కె)
ఏటూరునాగారం మండలం శివాపురంలోని సబ్బుల పరిశ్రమలో తయారైన బట్టల సబ్బులను జీసీసీ ద్వారా 2025 నుంచి 2026 ఫిబ్రవరి సరఫరా చేసిన బకాయిలు రూ.31.55 లక్షల బిల్లులు పరిశ్రమకు రావాల్సి ఉంది. పెండింగ్ బిల్లులతో పరిశ్రమకు తీసుకురావాల్సిన ముడి సరుకును తీసుకురాలేకపోతున్నాం. బిల్లులు ఇవ్వాలని జీసీసీ అధికారులను అడిగితే కాస్మోటిక్స్ బిల్లులు రావడం లేదని, దీంతో బిల్లులు ఇవ్వలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం.
– సౌజన్య, లక్ష్మీ, పరిశ్రమ గ్రూపు
అధ్యక్షురాలు, కార్యదర్శి, శివాపురం
●
గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్‌కి విద్యుత్ లైన్ ఇప్పించాలని గ్రామస్తులు కోరారు.
కన్నాయిగూడెం మండలం కంతనపల్లి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిలో కల్టివేషన్ ఉండగా ఫారెస్టు అధికారులు వాహనాలు తీసుకెళ్లారని బాధితులు విన్నవించారు.
తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన గిరిజనులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన గిరిజనులకు గిరి వికాస పథకం కింద బోరు మంజూరు చేయాలని కోరారు.
ఐలాపురం గ్రామం నుంచి పంట పొలాలకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని గ్రామస్తులు కోరారు.
కలెక్టర్ దివాకర టీఎస్
ఐటీడీఏ గిరిజనదర్బార్‌లో
130 దరఖాస్తులు


