● లక్నవరం హరిత టూరిజం మేనేజర్ శివశంకర్
గోవిందరావుపేట: లక్నవరం హరిత రిసార్ట్స్‌లో పరిసరాలను శుభ్రపరిచి, పర్యాటకులకు మెరుగైన వసతి సదుపాయాలను కల్పిస్తున్నామని టూరిజం మేనేజర్ సండ్రపాటి శివశంకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల స్వచ్ఛత డ్రైవ్‌లో భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు లక్నవరం హరిత రిసార్ట్స్‌లో సండ్రపాటి శివశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేలా రిసార్ట్స్ పరిసరాలను పూర్తిగా శుభ్రపరచామన్నారు. స్వచ్ఛమైన వాతావరణం పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
రామప్పలో..
వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట పరిధిలోగల రామప్ప హరిత హోటల్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని టూరిజం శాఖ అధికారులు నిర్వహించారు. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రంతో పాటు చెత్తచెదారాన్ని తొలగించినట్లు హరిత హోటల్ మేనేజర్ రంజిత్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా ములుగు గట్టమ్మ హారితహోటల్ వద్ద కూడా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హరితహోటల్ సూపర్‌వైజర్ రాకేష్, సిబ్బంది నర్సయ్య, రవి, సంతోష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: ఆశకార్యకర్తలకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్‌డ్ వేతనాలు రూ.18 వేలు అందించాలని ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. బండారుపల్లి రోడ్డు నుంచి వెళ్తున్న ఆశలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆశలకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశకార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండు రోజులుగా ధర్నా చేపట్టినా.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సర్వేలు నిర్వహిస్తూ అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. పెండింగ్ సర్వే బిల్లు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన రవిగౌడ్, ప్రభావతి, శోభ, చంద్రవాని, దేవి, సంధ్య, స్వరూప, మాదవి, అనిత, నాగమణి, రాజ్యలక్ష్మీ, సత్యవతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


