● కలెక్టర్ దివాకర టీఎస్
ఏటూరునాగారం: సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కొరకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ వైద్యులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ ఏటూరునాగారంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని గదులను, వార్డులను, రిజిస్టర్, ల్యాబ్, మెడికల్ స్టోర్ గది, లేబర్ రూమ్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలన్నారు. అనంతరం మండలకేంద్రంలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ ఫర్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ జగదీశ్వర్, సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, సర్పంచ్ శ్రీలత, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్) పండుగ సందర్భంగా కలెక్టర్ దివాకర శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల (జకాత్) ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. మత సామరస్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.


