రామప్ప టెంపుల్‌ బ్యూటిఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

రామప్ప టెంపుల్‌ బ్యూటిఫుల్‌

Mar 17 2026 7:28 AM | Updated on Mar 17 2026 7:28 AM

రామప్ప టెంపుల్‌ బ్యూటిఫుల్‌

వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్‌ బ్యూటిఫుల్‌గా ఉందని జర్మనీ దేశస్తులు మిచెల్‌, లుడ్విగ్‌లు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని వారు సోమవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోట్‌ షికారు చేస్తూ సరస్సు అందాలను తిలకించారు.

వ్యర్థాలు తిని వంద గొర్రెలు మృత్యువాత

ఎస్‌ఎస్‌ తాడ్వాయి : మేడారంలో భక్తులు పడేసిన వ్యర్థాలు (ఎండి పోయిన అన్నం) తిని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మరికెల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కొద్ది రోజుల క్రితం తనకున్న 200 గొర్రెలను తీసుకుని మేత నిమిత్తం తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఊరట్టం పంచాయతీ పరిధిలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గొర్రెల మంద పెట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా గొర్రెలు అస్వస్థకు గురై సుమారు వంద మృత్యువాత పడ్డాయి. మేడారం వనదేవలతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పడేసిన వ్యర్థాలు తినడంతో గొర్రెలు అస్వస్థకు గురై మృత్యువాత పడినట్లు బాధిత గొర్రెల యజమాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల పైగా నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిగతా గొర్రెలు కూడా అనారోగ్యంగానే కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా

రాకేశ్‌యాదవ్‌

ములుగు రూరల్‌: బీజేపీ ములుగు పట్టణ అధ్యక్షుడిగా ఇమ్మడి రాకేశ్‌యాదవ్‌ను నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో రాకేష్‌కు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీలో కట్టుబడి పనిచేశారని తెలిపారు. అనంతరం రాకేష్‌యాదవ్‌ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బలరాం, రవీంద్రాచారి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

ములుగురూరల్‌: అశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రూ.18వేల ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట 48 గంటల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఆశ వర్కర్లు 20ఏళ్లుగా పేద ప్రజలకు అనేక సేవలందిస్తున్నారని తెలిపారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి, రవి, నీలాదేవి, శ్రావ్య, రమాదేవి, రజిత, కవిత, చంద్రవాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement