నో ఎడిట్‌ ఆప్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నో ఎడిట్‌ ఆప్షన్‌

Mar 16 2026 7:26 AM | Updated on Mar 16 2026 7:26 AM

జీరో బిల్లు రావడం లేదు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేదేమీలేదంటున్న విద్యుత్‌శాఖ

జిల్లాలోని విద్యుత్‌ మీటర్ల వివరాలు

21 వేల మందికి రాని గృహజ్యోతి జీరో బిల్లు

రెండేళ్లుగా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్న పేదలు

● 99ప్రజాపాలన సమావేశాల్లో ఊసెత్తని అధికారులు

ఏటూరునాగారం 4వ వార్డులో సుమారు 56 మంది గృహజ్యోతి పథకం పొందని లబ్ధిదారులు ఉన్నారు. అందరూ నిరుపేదలే. ప్రజాపాలనలో గతంలో పెట్టుకున్న విద్యుత్‌ మీటర్లకు జీరో బిల్‌ రావడం లేదు. దీంతో విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను మండల పరిషత్‌ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సేకరించడం లేదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

– దేపాక ఎల్లమ్మ, 4వ వార్డు, ఏటూరునాగారం

ఏటూరునాగారం: పేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకానికి ఎడిట్‌ ఆప్షన్‌ లేదు. దీంతో విద్యుత్‌ బకాయిలు చెల్లించలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. 2 జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకు మోక్షం లేకుండా పోయింది. కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఇచ్చినప్పటికీ ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది డాటా ఎంట్రీ సక్రమంగా చేయకపోవడంతో అర్హులకు పథకం అందకుండా పోయింది. విద్యుత్‌శాఖ, కలెక్టరేట్‌ కార్యాలయ అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో లబ్ధిదారుల సమస్యలు గాలికివదిలేసినట్లు కనిపిస్తోంది. 99 ప్రజాపాలన పేరుతో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్పా ప్రజలకు అందని పథకాలు, పెండింగ్‌ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

రేషన్‌కార్డు, మహిళా, ఇంటి యజమాని పేరుపై సొంత ఇల్లు ఉండి విద్యుత్‌ మీటర్‌ ఉన్న లబ్ధిదారులకు గృహజ్యోతి పథకం కింద 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందుతుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగిస్తే జీరో బిల్‌ను విద్యుత్‌శాఖ వారు అందజేస్తున్నారు. కానీ అర్హులైన లబ్ధిదారులకు 198 యూనిట్లు నమోదు అయినప్పటికీ ప్రజాపాలనలో నో డాక్యుమెట్స్‌ అప్లయిడ్‌ అంటూ వెబ్‌సైట్‌ పోర్టల్‌లో రావడంతో లబ్ధిదారులు విద్యుత్‌శాఖ, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కావాల్సిన పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేసినప్పటికీ ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో లబ్ధిదారులను వెనక్కి పంపుతున్నారు.

గృహజ్యోతి పథకానికి ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో విద్యుత్‌ సర్వీస్‌కు సంబంధించిన సరైన ఆధారాలు ఇవ్వలేదు. దీంతో ఆ సర్వీసులకు జీరో బిల్లు ఇవ్వడం లేదని.. ఇప్పుడు దానికి చేసేదేమీ లేదని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతికి చెంది గృహజ్యోతికి అర్హత ఉన్న ప్రజలు పథకం వర్తించకపోవడంతో మీటర్‌ రీడింగ్‌ ప్రకారం డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం పెట్టిన పథకం కళ్లముందు కదిలాడుతున్నా దానికి ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులకు పథకం వర్తింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.

మండలాలు మొత్తం లబ్ధిదారులు పెండింగ్‌

సర్వీసులు

ములుగు 10,841 5,526 5,315

మల్లంపల్లి 4,062 3,085 977

వెంకటాపురం(ఎం) 6,373 4,925 1,444

గోవిందరావుపేట 6,888 4,670 2,218

ఎస్‌ఎస్‌తాడ్వాయి 3,988 3,016 972

ఏటూరునాగారం 6,431 3,453 2,978

మంగపేట 9,558 6,608 2,950

కన్నాయిగూడెం 1,875 1,727 148

వెంకటాపురం(కె) 8,737 5,838 2,899

వాజేడు 6,668 5,187 1,485

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement