ములుగు: 2027 జనాభా లెక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కలలో భాగంగా మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు జరిగే పేజ్ 1 హౌస్ లిస్టింగ్ – హౌసింగ్ సెన్సెస్ నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధిలో జనాభా లెక్కలు ఎంతో కీలకమైనవని తెలిపారు. జనాభా గణన ప్రాథమిక అవసరమని, హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియలో ఇంటి నిర్మాణం, నివాస పరిస్థితులు, కుటుంబ వివరాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, ఇంటి నిర్మాణ వివరాలతో పాటు తదితర 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలను, నగరంలోని వార్డులను గణన బ్లాకులుగా విభజించాల్సిన తీరు, గణన ప్రక్రియ నిర్వహించే అంశాలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ డిజిటల్ పద్ధతిలో సాగే అవకాశం ఉందని తెలిపారు. మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని సమాచార సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జనాభా లెక్కల సేకరణలో ఎటువంటి తప్పులకు తావివ్వకూడదని, ఇళ్ల లెక్కింపు మ్యాపింగ్ చేస్తూ ప్రతీ ఇంటికి నంబర్ కేటాయించాలన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన సమాచారం నమోదు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితమైన గణాంకాలు అందుతాయని వివరించారు. సమాచార సేకరణలో భాగంగా హెచ్‌ఎల్‌వో మొబైల్ అప్లికేషన్‌పై అధికారులకు, సూపర్‌వైజర్లకు, ఎన్యుమరేటర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ప్రత్యేక టెక్నికల్ బృందాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల అధికారుల బాధ్యతలను వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ వెంకటేశ్, హైదరాబాద్ జనగణన శాఖ అధికారులు హోబాలాల్, సరళ, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీపీఓ వెంకయ్య, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


