పూర్తయ్యేదెన్నడో..? | - | Sakshi
Sakshi News home page

పూర్తయ్యేదెన్నడో..?

Mar 14 2026 7:26 AM | Updated on Mar 14 2026 7:26 AM

తాత్కాలిక బస్టాండ్‌లో ఇబ్బందులు.. పాత బస్టాండ్‌ వద్ద రోడ్లపై పడిగాపులు

నత్తనడకన ములుగు బస్టాండ్‌ నిర్మాణ పనులు

ములుగు: నత్తకే నడక నేర్పుతున్నతీరుగా సాగుతున్నాయి.. ములుగు బస్టాండ్‌ నిర్మాణపనులు. ఆధునిక సౌకర్యాలతో మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మించి ఆరునెలల్లోపే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ పనులు పూర్తికాలేదు. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా.. పనుల పురోగతిలో ఎలాంటి మార్పులేదు. జిల్లా కేంద్రంలో మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో గతేడాది మే 4న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హైటెక్‌ తరహాలో బస్టాండ్‌ నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మేడారం జాతర లోపు మోడ్రన్‌ బస్టాండ్‌ వినియోగంలోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా పనులు స్లాబు నిర్మాణం వరకే జరిగాయి. దీంతో మేడారం జాతరకు వెళ్లే భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్టాండ్‌ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో స్లాబు వరకు పనులు పూర్తి చేసి సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో బస్టాండ్‌ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేనా... అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్‌ నిర్మాణం చేపడుతుండడంతో ములుగు శివారులోని లక్ష్మీనగర్‌ వద్ద తాత్కాలిక బస్టాండ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాగా ఏర్పడడంతోపాటు మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో రవాణా వ్యవస్థ పెరిగింది. పర్యాటక ప్రదేశాలు సైతం ములుగు జిల్లాలో అధికంగా ఉండడం, హనుమకొండ, భూపాలపల్లి, నర్సంపేట, ఏటూరునాగారం వెళ్లే ప్రయాణికులకు ములుగు కేరాఫ్‌గా ఉండడంతో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక బస్టాండ్‌ వద్ద కనీసం తాగునీటి వసతి కల్పించకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన నీడ లేకపోవడం, కూర్చోడానికి సరిపడా సీట్లు లేకపోవడం, మరుగుదొడ్లు కూడా రెండే ఉండడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు.

నూతనంగా నిర్మిస్తున్న పాత బస్టాండ్‌ వద్ద ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం వేచిచూడకుండా ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎండలో ఆర్టీసీ బస్సుల కోసం పడిగాపులు కాసే బదులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తూ గమ్యానికి చేరుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్‌ బస్టాండ్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

కనీస సౌకర్యాలు లేకుండా

ఉన్న తాత్కాలిక బస్టాండ్‌

10 నెలలు దాటినా పూర్తి కాని వైనం

తాత్కాలిక బస్టాండ్‌లో

కనీస వసతులు కరువు

రూ.4 కోట్లతో కొనసాగుతున్న

మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement