ములుగు: గ్యాస్ కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, గ్యాస్ సరఫరాపై అపోహలు నమ్మొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిల్వ చేయడం, అక్రమంగా మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడినందుకు 288 కేసులు నమోదు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలకు అవసరమైన మేరకు స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీసీఎస్‌ఓ ఫైజల్ హుస్సేన్, ఇరిగేషన్ ఈఈ అప్పలనాయుడు, హార్టికల్చర్ అధికారి సంజీవరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి:
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి
ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఆఫీసర్‌ను నియమించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ములుగు నుంచి కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ఆర్డీఓను ఆదేశించారు. తహసీల్దార్లు మ్యాపింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, ములుగు ఆర్డీఓ వెంకటేష్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సలీం పాషా, తహసీల్దార్ విజయభాస్కర్, ఎలక్షన్ డ్యూటీ నితీష్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


