ప్రచార ఆర్భాటం తప్ప సౌకర్యాలేవి
ములుగు: మేడారం మహాజాతరపై ప్రచారం ఆర్భాటం తప్ప భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఏమి లేవని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మేడారం జాతరకు 2014లో రూ.150 కోట్లు, 2016లో రూ.125 కోట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మేడారం జాతరలో అభివృద్ధి పనుల పేరిట నిధులు ఖర్చు చేశామని చెబుతున్న మంత్రులు వాటాల కోసం కుమ్ములాటలు పెట్టుకుంట్టున్నారని ఎద్దేవా చేశారు. సమ్మక్క సారలమ్మ దేవతల గద్దెల ప్రాంగణం సహజతత్వం కోల్పోయేలా చేశారని విమర్శించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా మేడారం జాతరలో కేవలం ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడానికే పరిమితమయ్యారని ఆరోపించారు. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులకు గురైన భక్తులు ప్రభుత్వానికి పెట్టిన శాపనార్థాలు తప్పకుండా తగులుతాయన్నారు. ములుగు నియోజకవర్గాన్ని రూ.100 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి, నాయకులు గోవింద్‌నాయక్, రమేష్‌రెడ్డి, చంద్రమౌళి, మోహన్, భిక్షపతి, విజయ్, సురేశ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రూ.100 కోట్లతో
ములుగును అభివృద్ధి చేశాం
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్


