ట్రాఫిక్ సమస్యల నివారణకు కమిటీ
ములుగు: రాబోయే మేడారం జాతరకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పూర్తిగా నివారించేందుకు ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం మహాజాతర విజయవంతానికి హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి వరకు 40 రోజుల పాటు అహర్నిశలు శ్రమించామని వెల్లడించారు. జాతరకు వచ్చిన కోటిన్నర మంది భక్తులను క్షేమంగా ఇంటికి చేర్చామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ దేవతలను గద్దెలకు తీసుకరావడం నుంచి వనప్రవేశం వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని వివరించారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే జాతరకు పూజారులకు, మీడియా ప్రతినిధులకు, స్థానిక మేడారం యువతకు, అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. మేడారంలో సమ్మక్క– సారలమ్మ వనదేవతలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఫైరింగ్ చేసి అమ్మవార్లకు స్వాగతం పలకడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో ములుగు ఓఎస్‌డీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్, సీఐలు సురేశ్, దయాకర్, ఎస్సైలు పాల్గొన్నారు.
మహాజాతరలో 40 రోజులపాటు
శ్రమించాం
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


