కేయూలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషన్‌నల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. క్యాంపస్‌లోని పలు కేంద్రాలను పరీక్షల విభాగం అధికారులు సందర్శించారు. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కె.మమత పరిశీలించారు.
పలు పరీక్షలు వాయిదా
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 7, 10వ తేదీల్లో నిర్వహించనున్న బీటెక్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. ఈపరీక్షలను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని, 10న నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, 11న నిర్వహించాల్సిన ఎంబీఏ పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈమార్పును కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని కోరారు.
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను మంగళవారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నల్ల రాతిలో శిల్పులు చెక్కిన శిల్పకళాసంపదను తిలకించారు. అనంతరం ఖుష్‌మహల్, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతిమట్టికోట అందాలను వీక్షించారు. కోట గైడ్ రవియాదవ్ కాకతీయుల శిల్పకళ గురించి వివరించగా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది, టీజీటీఎస్‌టీడీసీ ఆజయ్ తదితరులు ఉన్నారు.


