శరణ్(తెల్లపులి) ఇక లేదు
జూ పార్క్‌లో గుండెపోటుతో మృతి
న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని కాకతీయ జులాజికల్ పార్క్ సందర్శకులకు కనువిందు చేసిన తెల్లపులి (శరణ్, 14 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. మగ తెల్లపులిని హైదరాబాద్ నుంచి గతేడాది జూలైలో తీసుకొచ్చి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించి సందర్శకులు వీక్షించేందుకు వదిలారు. కొద్ది రోజులుగా జూ పార్క్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా తెల్లపులి సగటు వయస్సు 15ఏళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 14 ఏళ్లు ఉన్న తెల్లపులి వృద్దాప్యం వల్ల బీపీ, గుండె సంబంధిత, మూత్రపిండ సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతుందని తెలిపారు. పులికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందించినప్పటికి మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయిందిని జూ పార్క్ ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌ఓ మయూరి తెలిపారు. కాగా ఛీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరువెటర్నరీ కళాశాల వైద్యబృందం తెల్లపులికి పోస్టుమార్టం నిర్వహించి జూ పార్క్‌లోనే ఖననం చేసినట్లు చెప్పారు.


