రెండు ఓట్లతో గెలుపు
వెంకటాపురం(ఎం) : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన జాటోత్ గణేష్ ప్రత్యర్థిపై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జర్పుల హేమాపై గణేష్ రెండు ఓట్లతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. తొలుత ఒక్క ఓటుతోనే గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించగా, రీకౌంటింగ్ కావాలని ప్రత్యర్థి హేమా కోరడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ తలెత్తడంతో సమాచారం అందుకున్న ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేష్, ఎస్సై రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇరువురి మధ్య వీడియో చిత్రీకరిస్తూ ఓట్లను లెక్కించారు. చివరిగా రెండు ఓట్లు ఎక్కువ రావడంతో గణేష్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో జాటోత్ రుక్మాబాయిపై ఒక్క ఓటు తేడాతో జాటోత్ గణేష్ భార్య లతశ్రీ ఓడిపోయారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో గణేష్ రెండు ఓట్లతో గెలుపొందడం కొసమెరుపు.
జోరుగా మద్యం విక్రయాలు
కన్నాయిగూడెం : మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ మద్యం విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న గ్రామాల్లో బెల్టు షాపుల్లో మద్యం జోరు మాత్రం తగ్గడం లేదు. ఒక్కో వాడకు రెండు, మూడు బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతోంది. స్థానికంగా పోలీసులు దాడులు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి వ్యాపారులు మద్యం అమ్మకాలు ఆపడం లేదు. ఇలా మద్యం విక్రయాలు కొనసాగితే ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదముందని మండలవాసులు అనుకుంటున్నారు
విధి నిర్వహణలో అప్రమత్తం
చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సెక్యూరిటీ గార్డులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించాలని చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఏరియాలో పర్యటించి కేటీకే–6, ఓసీ–2 చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థ భద్రతా వ్యవస్థలో సెక్యూరిటీ గార్డుల పాత్ర అత్యంత కీలమని తెలిపారు. క్రమశిక్షణ, అప్రమత్తత, అంకితభావంతో పని చేయాలని సూచించారు. భద్రత ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ సంస్థ ఆస్తులు, సిబ్బంది రక్షణే ప్రధాన లక్ష్యమన్నారు. సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం ఎల్లప్పుడు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ అధికారి మురళీమోహన్, సీనియర్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మిరాజం, జమేధార్ దేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యమబాధలు తొలగి.. ముక్తి పొందుతారు
కాళేశ్వరం : కాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటే యమబాధలు తొలగి..ముక్తి పొందుతారని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలూక్ పీఠాధితి రాజేంద్రదాస్‌జీ వృందావన్ భక్తులకు ప్రవచనంలో వినిపించారు. సోమవారం స్వామిజీ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మండపం వద్ద స్వామిజీని ఈఓ మహేష్ కండువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ..అలహాబాద్‌లోని గంగా, యమున, సరస్వతి ఎంత ప్రసిద్ధి చెందినవో.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదుల్లో భక్తులు స్నానాలు చేస్తే అంతటి మహాభాగ్యం పొందుతారని అన్నారు. 2026, మే 21నుంచి జూన్ 1వరకు సరస్వతినదికి అంత్యపుష్కరాలు జరుగుతాయని, భక్తులు పుణ్యస్నానాలు చేసి పునీతులు కావాలని కోరారు.
ఆలయ ఉద్యోగి జేబునుంచి నగదు చోరీ
కాళేశ్వరాలయ ఉద్యోగి జేబులో నుంచి రూ.48వేల నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీఠాధిపతి మలూక్ రాజేంద్రదాస్‌జీ వస్తున్న క్రమంలో ఆలయ ఉద్యోగి రాజశేఖర్ తన ప్యాంటు జేబులో రూ.48వేల నగదు పెట్టుకున్నాడు. దీంతో భక్తజనం గుండా ఓ గుర్తుతెలియని వ్యక్తి తన జేబులోని నగదును దొంగిలించాడు. అక్కడి సీసీ కెమెరాలో ఉద్యోగి వద్దకు దొంగ వచ్చే వరకు మాత్రమే నిక్షిప్తమైంది. తర్వాత జేబు చూసుకొని ఉద్యోగి కంగుతిన్నాడు. ఈఓ మహేష్‌కు తెలుపడంతో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఆ జేబులోని డబ్బులు దేవస్థానం గదుల కిరాయికి సంబంధించినవని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు.
రెండు ఓట్లతో గెలుపు


