ముగిసిన ప్రచారం.. ప్రలోభాల పర్వం
రేపు కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మూడో విడత పంచాయతీలకు పోలింగ్
ములుగు: తుది విడత పంచాయతీ పోరు బుధవారం జరుగనుంది. జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మూడో విడత ఎన్నికలు రేపు జరుగనుండగా సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడింది. 20 రోజులుగా పల్లెల్లో గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు సోమవారం రాత్రి నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందు, మాంసంతో పాటు ఓటుకు రూ.300ల నుంచి రూ.500 ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. మొదటి విడతలో 48 గ్రామపంచాయతీలకు 9 ఏకగ్రీవం కాగా 39 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 23 స్థానాలను, బీఆర్‌ఎస్ 7 స్థానాలను ఇతరులు ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. రెండో విడతలో 52 గ్రామ పంచాయతీలకు 15 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 37 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 22 కాంగ్రెస్, 13 బీఆర్‌ఎస్, ఇతరులు 2 స్థానాలను గెలుచుకున్నారు.
45 సర్పంచ్.. 157 వార్డులు
జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల పరిధిలో 46 గ్రామ పంచాయతీలకు, 408 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం కన్నాయిగూడెం మండల పరిధిలోని ముప్పనపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. మూడు మండలాల్లో 73 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 45 గ్రామపంచాయతీలకు 157 మంది సర్పంచ్ అభ్యర్థులు, 335 వార్డు స్థానాలకు 866 మంది వార్డు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కన్నాయిగూడెం మండలంలో 9,992 మంది ఓటర్లు, వెంకటాపురం(కె) మండలంలో 25,336 మంది ఓటర్లు, వాజేడు మండలంలో 19,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం మూడు మండలాల పరిధిలో 335 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా సుమారు 500 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నారు.
కొనసాగుతున్న కాంగ్రెస్ జోరు
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకొని జోరు మీద ఉంది. జిల్లాలో పట్టు కోసం బీఆర్‌ఎస్ నాయకులు తాపత్రయపడుతున్నారు. జిల్లాలోని ఆరు మండలాల్లో జరిగిన మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 100 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగగా 73 స్థానాల్లో కాంగ్రెస్, 24 స్థానాల్లో బీఆర్‌ఎస్, 3 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజలంతా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. రెండు విడతల్లో విజయకేతనం ఎగరేసి జోరు మీద ఉన్న కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ మూడో విడత ఎన్నికల్లో ఎంతమేరకు చెక్ పెడుతుందో వేచి చూడాల్సిందే.
45 సర్పంచ్ స్థానాలకు.. 157 మంది అభ్యర్థుల పోటీ
347 వార్డు స్థానాలకు బరిలో 866 మంది
ముగిసిన ప్రచారం.. ప్రలోభాల పర్వం
ముగిసిన ప్రచారం.. ప్రలోభాల పర్వం


