ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింపును పూర్తి చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్న కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
వాజేడు : మూడోదశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్.దివాకర ఆదేశించారు. మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంపీఓ, జోనల్ ఆఫీసర్స్, ఆర్‌ఓలు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులు ప్రతిఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి పోలింగ్ డే రోజున ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, అధికారులు విధులకు గైర్హాజర్ అయితే చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సిగ్నల్ అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు.
అధికారులతో సమీక్ష సమావేశం
వెంకటాపురం(కె): మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల అధికారులతో కలెక్టర్ టీఎస్.దివాకర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్ పోలింగ్ బూత్‌ల వద్ద సౌకర్యాలపై సమీక్షించారు. ఎన్నికల విధి విధానాలపై దిశానిర్దేశం చే శారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణగోపాల్, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


