ఓట్లు రాకపాయె!
నోట్లు పాయె..
జీపీ ఎన్నికల్లో రూ.లక్షలు వెచ్చించిన అభ్యర్థులు
ములుగు: జిల్లాలో తొలి, రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతల్లోని ఫలితాలపై ఓటమి చెందిన అభ్యర్థులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. నోట్ల కట్టలు పాయె.. ఓట్లు రాకపాయె అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రెండో విడత ఫలితాలు వెలువడిన ఆదివారం వరకు అభ్యర్థులు చేసిన ఖర్చు తడిసి మోపైడెంది. తొలివిడత నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత.. వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబురాల్లో మునిగి తేలుతుండగా.. ఓడిన వారు ఎక్కడ బోల్తాపడ్డామని సమీక్షించుకుంటున్నారు.
సొంతపార్టీ నేతలే కొంపముంచారని ఆవేదన
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కుల సంఘాల వారీగా ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులకు ఓట్లు రాకపోవడంతో ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేశారు. కుల సంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందు పార్టీల కోసం అభ్యర్థులు అదనంగా ఖర్చు చేశారు. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ చేసిన ఫలితం లేకుండా పోయింది. నమ్మిన వారే నమ్మకంగా వంచించారంటూ సొంతపార్టీలో కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
పైసా పట్టుపడలే..
జిల్లాలోని ఆరు మండలాల్లో ఇప్పటివరకు గ్రామపంచాయతీల ఎన్నికలు పూర్తి కాగా ఎన్నికలు జరిగిన మండలాల్లో ఇప్పటివరకు తనిఖీ బృందాలకు ఒక్కపైసా కూడా పట్టుబడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఓటర్లకు డబ్బులు పంచేందుకోసం లక్షలాది రూపాయలు పట్టణాల నుంచి పల్లెలకు తరలివచ్చిన తనిఖీ బృందాలకు కంటపడకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తరలిస్తే తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలాంటి సంఘటనలు ఇప్పటివరకు జిల్లాలో చోటుచేసుకోకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడో విడత ఎన్నికల్లోనైనా తనిఖీ బృందాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే..
ఓట్ల ఖరీదు రూ.20 కోట్లు
జిల్లాలో తొలి, రెండో విడతల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు రూ.20 కోట్ల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టినట్లు సమాచారం. జిల్లాలో 146 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మొదటి, రెండో విడతల్లో ఆరు మండలాల్లోని 100 పంచాయతీలకు 24 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 76 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 76 పంచాయతీల పరిధిలో 1,15,305 మంది ఓటర్లు ఉండగా 93,037 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో 20 రోజులుగా సగటున ఒక్కో అభ్యర్థి రూ. 5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అనాధికారికంగా ఖర్చు చేశారు. మేజర్ గ్రామపంచాయతీలతో పాటు, పెద్ద గ్రామపంచాయతీల్లో ఈ వ్యయం మరింత పెరిగింది. ఈ లెక్కన ఒక్కో ఓటు కోసం సగటున సర్పంచ్ అభ్యర్థులు రూ.3 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చు చేసిన డబ్బుకు సరిపడా ఓట్లు రాలేకపోయాయని పరాజితులు కన్నీరు పెడుతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు లెక్కల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో పాల్గొంటున్నారు.
పంచాయతీ ఫలితాలపై పరాజితుల పోస్టుమార్టం
తొలి, రెండో విడత ఎన్నికల్లో ఖర్చు రూ.20 కోట్లు
ఓట్లు రాకపాయె!
ఓట్లు రాకపాయె!


