లెక్కలు చెప్పాల్సిందే..
జిల్లాలో 145 పంచాయతీలకు ఎన్నికలు
45 రోజుల్లోపు ఎన్నికల
ఖర్చులు చెప్పాలి
ములుగు: సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చును ఎంపీడీఓలకు తెలియజేసి రశీదు తీసుకోవాలి. లేదంటే వేటు పడే ప్రమాదం ఉంది. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు ఎంపీడీఓలకు సమర్పించాలి.
గ్రామ పంచాయతీలకు ప్రతినిధులుగా ఎన్నికై న వారు, మేమే గెలిచాం.. ఇక గ్రామానికి మేమే రాజులం అనే భావన వీడి సేవకులం అనే బాధ్యతను గుర్తించాలి. అధికారాలే కాదు.. కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం మరిచినా.. కుర్చీకే ఎసరు రావచ్చు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం స్థానిక పాలకులకు పగ్గాలు వేసి ప్రజల చేతికిచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ. 2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5 వేల జనాభా కంటే తక్కువగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.30 వేల వరకు ఖర్చు చేయొచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి 45 రోజుల లోపు సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీఓలకు నిర్దేశిత పద్ధతిలో లెక్కలు అప్పజెప్పాలి. సకాలంలో లెక్కలు చూపకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ రాజ్ చట్టం– 2018 కింద సదరు అభ్యర్థులు మూడేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటిస్తుంది. ఒక వేళ అభ్యర్థి సదరు ఎన్నికల్లో గెలిచి, నిర్ణీత సమయంలోగా ఖర్చు వివరాలు ఇవ్వకుంటే, పదవిని కోల్పోయినట్లు ప్రకటిస్తుంది. సర్పంచ్‌లకు నెలకు రూ.6,500 చొప్పున ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఉంటుంది.
సర్పంచులు కనీసం నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, మూడు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. లేదంటే పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా పదవి నుంచి తొలగిస్తారు. అవినీతి ఆరోపణలు నిరూపితమైతే అనర్హత వేటు పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో చురుకుగా వ్యవహరించాలి. మొక్కలను నాటడం, అందులో 80 శాతం మేర మొక్కలు బతికేలా చూడటం వారి బాధ్యత. గ్రామంలో తాగునీటి సౌకర్యం, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషించాలి.
జిల్లాలో 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు ఉండగా, మంగపేట మండలంలోని 25 పంచాయతీలపై హైకోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 9 మండలాల పరిధిలోని 146 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా, మొదటి, రెండో విడత ఎన్నికల్లో 100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 24 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 76 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. మూడో విడతలో 45 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ప్రజా ప్రతినిధులుగా ఎంపికై న వారితో పాటు ఓటమి చెందిన అభ్యర్థులు కూడా స్థానిక ఎంపీడీఓలకు ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు 45 రోజుల్లోగా అందించాలి.
లేదంటే మూడేళ్లపాటు పోటీకి
అనర్హుడిగా ప్రకటన
గెలిచిన వారైతే పదవి కోల్పోయే ప్రమాదం
లెక్కలు చెప్పాల్సిందే..


