పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధిని చూసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క మంగళవారం మీడియాతో మాట్లాడారు. మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు విడతల్లో ఇప్పటివరకు నిర్వహించిన జీపీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం పార్టీపరంగా బీసీలకు అవకాశం కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిందన్నారు. అందులో జిల్లాలో సైతం అత్యధికస్థానాల్లో గెలిచి కాంగ్రెస్ ముందంజలో ఉందని వివరించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటూరునాగారంలో ఒక్క సీటు గెలుపొందగానే తప్పుడు వార్తలను బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ కీలక నేతల గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహిళ సమ్మక్క– సారలమ్మ దేవతలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మగౌరవం, అస్తిత్వం దెబ్బతినేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నాయకులు చింతనిప్పుల భిక్షపతి, వంగ రవియాదవ్, రవీందర్‌రెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క


