వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలన
ములుగు: జిల్లాలో జరుగుతున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి పోలింగ్ జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టీఎస్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటాపురంలో 116, ములుగులో 92, మల్లంపల్లి మండలంలో 53 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నేరుగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మూడు మండలాలకు సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లు) నియమించి, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలన
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ములుగు మండలంలోని ఇంచర్ల, బరిగలపల్లి, జవహర్‌నగర్, వెంకటాపురం మండలంలోని లింగాపూర్, ఎల్లారెడ్డిపల్లి, నల్లగుంట, పాలంపేట, రామంజపూర్, నారాయణగిరిపల్లె, నర్సాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


