విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
గోవిందరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు జరగనున్న మొదటి విడత పోలింగ్ విధుల్లో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి బలగాల వినియోగం, రూట్ మ్యాప్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా అమలు చేయాలన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 140 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది పోలింగ్ స్టేషన్ పరిధిని దాటి వెళ్లకూడదని సూచించారు. పోలింగ్, లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పస్రా ఎస్సై నంబర్ 8712670085, పోలీస్ స్టేషన్ నంబర్ 8712670086 కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎంపీడీఓ చిలువేరు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


