ఢిల్లీకి చేరిన ‘కొండా’ వివాదం | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి చేరిన ‘కొండా’ వివాదం

Oct 18 2024 1:46 AM | Updated on Oct 19 2024 1:45 PM

ఢిల్ల

ఢిల్లీకి చేరిన ‘కొండా’ వివాదం

రెండు గ్రూపులుగా విడిపోయిన ‘వరంగల్‌’ ఎమ్మెల్యేలు

మంత్రి సురేఖ మితిమీరిన జోక్యంపై సీఎం, టీపీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు

సురేఖ మాకు స్ఫూర్తి: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

గ్రూపులపై ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఆరా..

సమన్వయం కోసం ఇన్‌చార్జ్‌ మంత్రి ‘పొంగులేటి’ ప్రయత్నం

‘హస్త’వ్యస్తంగా ఓరుగల్లు కాంగ్రెస్‌ రాజకీయాలు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం ఢిల్లీకి చేరింది. వరంగల్‌ పార్లమెంట్‌ పరిఽధిలోని నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ప్రత్యక్షంగా, మరో ఎమ్మెల్యే పరోక్షంగా సీఎం, టీపీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీని కలిసిన ఎమ్మెల్యేలు.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ‘కొండా’ దంపతుల మితిమీరిన జోక్యంపై వివరించినట్లు సమాచారం. 

ఆలయ కమిటీలు మొదలు పలు నామినేటెడ్‌ పోస్టులపై స్వయం నిర్ణయం తీసుకుంటుండంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలన్నింటిపై టీపీసీసీ చీఫ్‌, ఏఐసీసీ పరిశీలకులనుంచి ఢిల్లీ పెద్దలు సమగ్ర నివేదిక తెప్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‘వరంగల్‌ వివాదం’పై గురువారం పార్టీ సీనియర్లు, ప్రజాప్రతినిధులను ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.

హాట్‌టాపిక్‌గా గ్రూపుల పోరు.. అగ్రనేతల సంప్రదింపులు..
ఓరుగల్లు కాంగ్రెస్‌లో గ్రూపుల పోరు రాష్ట్రస్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖపై సొంత జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లెక్సీ వివాదంతో మొదలు. ప్రత్యక్ష ఫిర్యాదుల దాకా వెళ్లడం.. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ రంగంలోకి దిగడం పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. ఇదేకాకుండా ఢిల్లీ హైకమాండ్‌ వరకు వెళ్లిన కొండా సురేఖ వివాదంపై ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్‌ ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. టీపీసీసీ చీఫ్‌, దీపాదాస్‌ మున్షీలతో ఆగకుండా తన అపాయింట్‌మెంట్‌ కోరడం ద్వారా తీవ్రతను అర్థం చేసుకున్న వేణుగోపాల్‌ ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా చెబుతున్నా రు. 

ఇదే సమయంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌లకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రాత్రి ఉమ్మడి వరంగల్‌ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలిసింది. ఇదే సమయంలో మేడారం పర్యటనను ముగించుకున్న మంత్రి సురేఖ సైతం హైదరాబాద్‌కు చేరుకుని దీపాదాస్‌ మున్షీ, బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితర నేతలకు వివాదాలకు కారణమైన పలు అంశాలను వివరించినట్లు సమాచారం. కొండా సురేఖ వర్సెస్‌ జిల్లా ఎమ్మెల్యేల పంచాయితీపై అందరినీ సమన్వయం చేసేందుకు మరోమారు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఏఐసీసీ, టీపీసీసీ ఇన్‌చార్జ్‌లు శుక్రవారం భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఏడుగురు ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. వరంగల్‌ తూర్పునుంచి ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆమైపె ఫిర్యాదు చేసిన వారిలో స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పరకాల, వరంగల్‌ పశ్చిమ, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణతోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో జరిగిన సంఘటనలు.. ప్రొటోకాల్‌, ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవడం నచ్చడం లేదని ఈ సందర్భంగా సదరు ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సమాచారం.

 కాగా, రెండు రోజుల కిందట వరంగల్‌లో ఓ కార్యక్రమానికి హాజరై ఫొటో దిగిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.. ‘ప్రజల పక్షాన నిలబడి నిలదొక్కుకుంటానని నిరూపించుకు న్న డైనమిక్‌ లీడర్‌ కొండా సురేఖ నిబద్ధత మాకు స్ఫూర్తి’ అని ఎక్స్‌లో మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ‘బీసీ మహిళా నేతగా.. మంత్రిగా ఉన్న తనను కావాల నే బద్నాం చేస్తున్నారని’ కొండా సురేఖ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కేటీఆర్‌ తనపై విషప్రచారం చేసిన సమయంలోచేసిన కామెంట్స్‌పై సైతం కుట్రలో భాగంగానే రాద్ధాంతం చేశారంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement