టీకాలతో రక్ష | - | Sakshi
Sakshi News home page

టీకాలతో రక్ష

Oct 20 2025 7:32 AM | Updated on Oct 20 2025 7:32 AM

టీకాల

టీకాలతో రక్ష

ములుగు రూరల్‌: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయిస్తేనే రక్ష అని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏడాదికి రెండు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా జిల్లాలో రెండోదఫా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా వేసే కార్యక్రమాన్ని పశు వైద్యాధికారులు ప్రారంభించారు. ఈ మేరకు పశు వైద్యాధికారులు బృందాలుగా ఏర్పడి టీకాలు వేస్తున్నారు. గాలికుంటు వ్యాధి లక్షణాలు కలిగిన పశువులను మొదటగా మందల నుంచి వేరు చేయాలి. లేని పక్షంలో మందలో ఉన్న అన్ని పశువులకు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి సోకితే పశువుల్లో ఉత్పాదకత శక్తి, పునరుత్పత్తి సామర్ధ్యం కుంటుపడే ప్రమాదం ఉంటుంది.

వ్యాధి లక్షణాలు

పశువుల శరీర ఉష్ణోగ్రత పెరిగి నీరసించి పోవడం, నోరు, నాలుక, కాళ్ల గిట్టల మధ్య బొబ్బలు వస్తాయి. అలాగే అవి పగిలి పుండ్లుగా మారడంతో పాటు పశువులు మేత తినక నీరసించిపోతాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీంతో పశువులు వ్యవసాయ పనులు చేయలేక పోతాయి. గాలికుంటు సోకిన పశువుల పాలను దూడలకు పట్టిస్తే దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. పశువులకు మార్చి, ఏప్రిల్‌, మే నెలలతో పాటు ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాలలో ఎక్కువగా గాలికుంటు వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

నివారణ చర్యలు

వ్యాధి లక్షణాలు కనిపించిన పశువులను మందల నుంచి వేరు చేయాలి. పశువుల పాకను శుభ్రంగా ఉంచుకోవాలి. నాలుగు నెలల దూడ నుంచి తప్పని సరిగా టీకాలు వేయించాలి. సంవత్సరానికి రెండు సార్లు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. వ్యాధి సోకి పుండ్లు అయిన పశువులకు పొటాషియం పర్మాగనేట్‌ ద్రావణంతో పుండ్లను శుభ్రం చేయాలి. నోటి పుండ్లకు బోరో గ్లిజరిన్‌ పూయాలి. వ్యాధి బారిన పడిన పశువులను వైద్యులకు చూపించి చికిత్స అందించాలి.

టీకాలు తప్పనిసరిగా వేయించాలి..

గాలికుంటు వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిలో రెండుసార్లు టీకాలు ఉచితంగా అందిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎఫ్‌ఎండీ వ్యాక్సిన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అన్ని మండలాల్లో పశువైద్యాధికారులు 23 బృందాలుగా ఏర్పడి టీకాలు అందిస్తున్నారు. జిల్లాలో పశువుల సంఖ్య ఆధారంగా సరిపడా డోసులు అందుబాటులో ఉన్నాయి. నెల రోజుల పాటు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. రైతులు తప్పని సరిగా పశువులకు టీకాలు వేయించాలి. టీకాలు వేయించిన పశువుల వివరాలు ఐఎన్‌పీహెచ్‌ పోర్టల్‌లో నమోదు అవుతాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– కొమురయ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

టీకాలతో రక్ష1
1/1

టీకాలతో రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement