Heroes Turns As Director: మధ్యలో తప్పుకున్న దర్శకులు.. మెగా ఫోన్‌ పట్టిన స్టార్‌ హీరోలు

Vishal, Raghava Lawrence,Ajay Devgan, Vishwak Sen Turns As A Director - Sakshi

ఇండస్ట్రీలో క్రియేటివ్‌ కథలు ఉన్నట్లే, అప్పుడప్పుడూ ‘క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌’ కూడా ఉంటాయి. అభిప్రాయ  భేదాల వల్ల కొన్నిసార్లు హీరోయే దర్శకుడిగా మారాల్సి వస్తుంది. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక పోవడంవల్ల కూడా ఒప్పుకున్న సినిమా నుంచి దర్శకుడు తప్పుకోవచ్చు. అలా ఈ మధ్య  కొందరు దర్శకులు తప్పుకుంటే వారి స్థానంలో హీరోయే డైరెక్టర్‌గా మారారు. అలా డైరెక్షన్‌ మారింది. ఆ విశేషాలు తెలుసుకుందాం.

విశాల్‌ కెరీర్‌లో ఉన్న విజయవంతమైన చిత్రాల్లో ‘తుప్పరివాలన్‌’ (2017) (తెలుగులో ‘డిటెక్టివ్‌’) ఒకటి. మిస్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ చేసిన ఈ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌కు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఎంతలా అంటే ‘తుప్పరివాలన్‌’ సీక్వెల్‌ కోసం ఎదురు చూసేంత. ప్రేక్షకుల ఆసక్తిని గమనించిన విశాల్, మిస్కిన్‌ ‘తుప్పరివాలన్‌ 2’ను ప్రకటించారు. వీలైనంత త్వరగా  రిలీజ్‌ చేయాలని వెంటనే షూటింగ్‌ కూడా ఆరంభించారు. కానీ అనుకోకుండా ఈ సీక్వెల్‌కు బ్రేక్‌లు పడ్డాయి.

షూటింగ్‌ లొకేషన్స్, బడ్జెట్, కథ అంశాల్లో విశాల్, మిస్కిన్‌ల మధ్య అభిప్రాయభేదాల వల్లే ఈ బ్రేక్‌ అనే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమే అన్నట్లుగా ‘తుప్పరివాలన్‌ 2’కు తానే దర్శకత్వం వహిస్తున్నట్లుగా ఓ సందర్భంలో ప్రకటించారు విశాల్‌. అలా హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ‘తుప్పరివాలన్‌ 2’కు విశాలే దర్శకుడు. చర్చలు సఫలమై మిస్కిన్‌ మళ్లీ టేకప్‌ చేస్తారనే టాక్‌ కూడా   ఉంది.

(చదవండి: బాలీవుడ్‌లో సమంత భారీ సినిమా.. హీరోగా ఎవరంటే?)

మరోవైపు యశ్‌ ‘కేజీఎఫ్‌’ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను బాగా థ్రిల్‌ చేశాయి. ఈ చిత్రం హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌లకు ఎంత పేరు వచ్చిందో ‘కేజీఎఫ్‌’ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ అన్బు, అరివులకు అంతే పేరు వచ్చింది. ఈ ఇద్దరూ దర్శకులుగా మారాలనుకున్నారు. కొరియోగ్రాఫర్, నటుడు, దర్శక–నిర్మాత రాఘవా లారెన్స్‌ వీరికి ఆ చాన్స్‌ ఇచ్చారు. అన్బు, అరివుల దర్శకత్వంలో రాఘవా లారెన్స్‌ హీరోగా ‘దుర్గ’ అనే సినిమా షూటింగ్‌ ఆరంభమైంది కూడా. కానీ వివిధ కారణాల వల్ల ‘దుర్గ’ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి అన్బు, అరివులు తప్పుకున్నారు. ఇప్పుడు ‘దుర్గ’ సినిమాకు రాఘవా లారెన్స్‌నే దర్శకత్వం వహిస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం.

సేమ్‌ సీన్‌ బాలీవుడ్‌లోనూ రిపీట్‌ అయ్యింది. అజయ్‌ దేవగన్‌ హీరోగా‘బోళ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమిళంలో కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాకు ‘బోళ’ హిందీ రీమేక్‌. ఈ చిత్రానికి ముందు దర్శకుడిగా ధర్మేంద్ర శర్మ బాధ్యతలు తీసుకున్నారు. కారణం బయటకు రాలేదు కానీ ఇప్పుడు ‘బోళ’ సినిమాకు అజయ్‌ దేవగన్‌నే దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకుడు మారడం తెలుగులోనూ జరిగింది. హీరో విశ్వక్‌ సేన్, దర్శకుడు నరేశ్‌ కుప్పిలి కాంబినేషన్‌లో ‘పాగల్‌’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విశ్వక్, నరేశ్‌ కలిసి ‘దాస్‌ కా దమ్కీ’ అనే సినిమాను ఆరంభించారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు నరేశ్‌ దర్శకుడు కాదు. విశ్వక్‌ సేన్‌ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇలా హీరోయే దర్శకుడిగా మారిన మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి.                                         

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top