
వచ్చే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్!
సాక్షి, సినిమా : హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో వీరి ఎంగేజ్‌మెంట్ అయింది. ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కొన్నేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనిపై ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ ఎప్పుడూ స్పందించ లేదు. కానీ, వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మాత్రం ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోగ్రాఫర్ల కంట పడేవారు. వీరి నిశ్చితార్థంపై గతంలోనూ పలు వార్తలొచ్చినప్పటికీ అవి వదంతులుగా మిగిలిపోయాయి. అయితే శుక్రవారం ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా విజయ్, రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు.