
కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వెట్రిమారన్. అసురన్, పొల్లధవన్, వడ చెన్నై, విడుదలై లాంటి చిత్రాలతో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శింబు హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఒకవైపు డైరెక్టర్గా రాణిస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ గ్రాస్ రూట్ ఫిల్మ్ బ్యానర్లో పలు సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్యానర్లో బ్యాడ్ గర్ల్ అనే మూవీని నిర్మించారు.
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్లు వెట్రిమారన్ ప్రకటించారు.. సినిమా నిర్మాణం సవాల్తో కూడుకున్నదని అన్నారు. మూవీ తీయడానికి డబ్బు అప్పుగా తీసుకోవడం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. బ్యాడ్ గర్ల్ మూవీ మా నిర్మాణ సంస్థ చివరి చిత్రం అవుతుందని వెట్రిమారన్ వెల్లడించారు. నిర్మాత చేయడం టాక్సింగ్‌గా ఉందని కామెంట్స్ చేశారు.
కాగా.. వర్ష భారత్ దర్శకత్వం వహించిన 'బ్యాడ్ గర్ల్' చిత్రంలో అంజలి శివరామన్, శాంతి ప్రియ నటించారు. ఇటీవలే టీజర్ విడుదల కాగా.. వివాదం తలెత్తింది. దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపగా.. చివరికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లలకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
దర్శకుడు వెట్రి మారన్ మాట్లాడుతూ.. "నిర్మాతగా ఉండటం అనేది ఒక టాక్సింగ్ జాబ్ లాంటిది. దర్శకుడిగా ఉండటం అనేది సృజనాత్మకమైన పని. ఆ ఉద్యోగంలో ఎటువంటి ఒత్తిడి ఉండదు. మన పని మనం చేసుకోవాలి. కానీ, మీరు నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. చివరికీ టీజర్ కింద వచ్చే కామెంట్స్ కూడా చదవాలి. నటీనటులు, ప్రకటనలు సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక నిర్మాతగా అది చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. దర్శకుడు మిస్కిన్‌తో కొన్ని రోజుల క్రితం దీని గురించి మాట్లాడా" అని అన్నారు. తన నిర్మాణ సంస్థలో వస్తోన్న మానుషి చిత్రం రివైజింగ్ కమిటీ వద్ద ఉందని పేర్కొన్నారు. కాగా.. బ్యాడ్ గర్ల్ సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.