
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ సంచలన ఆరోపణలు చేశారు. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ తనను మోసం చేశారంటూ కామెంట్స్ చేశారు. సినిమా నిర్మాణంలో దాదాపు రూ.80 కోట్ల వరకు అవతవకలకు పాల్పడారంటూ ఆరోపించారు. అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమా నిర్మించే సమయంలో తన ఫేక్ కంపెనీతో మనీ లాండరింగ్కు పాల్పడ్డాడని వాసు భగ్నానీ వెల్లడించారు.
తన ఫేక్ కంపెనీ పేరుతో ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబుదాబిలో రిజిస్టర్ చేసిన కంపెనీ పేరుతో.. ముంబయిలో జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ పేరుతో మనీలాండరింగ్ చేశాడని అన్నారు. సినిమా బడ్జెట్‌ను దాదాపు రూ. 80 కోట్లు పెంచారని భగ్నాని వెల్లడించారు. ఆఖరికి నటీనటుల పారితోషికం తగ్గించినా భారీ మోసం కావడంతో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. దీనిపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేవలం నా డబ్బును తిరిగి పొందడం మాత్రమే కాదు. మరే ఇతర నిర్మాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని నిజం బయటకు రావాలని పోరాడుతున్నట్లు వాసు భగ్నానీ అన్నారు.
నిర్మాత వాసు భగ్నానీ మాట్లాడుతూ.. 'అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు మెహ్రా.. ఏఏజెడ్ ఫిల్మ్స్ అనే బ్యానర్ కింద పనిచేస్తున్నారు. మేము బడే మియాన్ చోటే మియాన్ మూవీ కోసం వారితో జతకట్టా. నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక సహాయం కూడా చేశా. వారికి దర్శకత్వాన్ని బాధ్యతలు అప్పగించా. సృజనాత్మక నిర్ణయాలలో తాను పెద్దగా జోక్యం చేసుకోలేదని.. లండన్తో పాటు ఇండియాలో జాఫర్ సూచించిన షూటింగ్ ప్రదేశాలను ఆమోదించా. అయితే రెండు నెలల క్రితమే జాలీ జంపర్ ఫిల్మ్స్ ఎల్ఎల్సీ సంస్థ గురించి తెలుసుకున్నా. అది జాఫర్ సహాయకుడి పేరుతో రిజిస్టర్ చేశారు. ఇదంతా బయటికి రాకుండా రహస్యంగా నిర్వహించారు. సినిమా ఖర్చులను పెంచడం, నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు" అని అన్నారు. కాగా.. గతంలో బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కూడా ఈ సినిమా కోసం ఆస్తులు తాకట్టు పెట్టామని ఆవేదన చెందారు.