
మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ రోజు ఉదయం (సెప్టెంబర్ 10) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘మా లిటిల్ మ్యాన్’ అంటూ ఒళ్లో బిడ్డను ఎత్తుకొని ఉన్న లావణ్య నుదిటిపై ముద్దు పెడుతున్న ఆయన ఫోటోని షేర్ చేశాడు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వరుణ్ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. ‘కొణిదెల ఫ్యామిలీలోకి మరోవ్యక్తి వచ్చాడు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు. నాగబాబు, పద్మజ గ్రాండ్ పెరెంట్స్‌గా ప్రమోట్ అయినందుకు ఆనందంగా ఉంది’అంటూ బాబుని తన చేత్తుల్లో ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. చిన్నారికి అభిమానుల ఆశీస్సులు ఉండాలి అని చిరంజీవి కోరారు.
కాగా, లావణ్య, వరుణ్‌లది ప్రేమ వివాహం. మిస్టర్ (2017) సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్ చేసి, 2023 నవంబర్‌లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది మేలో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు మెగా ఫ్యామిలీ చెబుతోంది.
