వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లైంట్. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు.
ఈ సినిమా కథేంటంటే..
గర్భిణి మహిళ హత్యతో ఈ కథ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ హత్య కేసు సంవత్సరాల పాటు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు కథ మొదలవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్లంతా చనిపోతారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్‌కుమార్) ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే పోలీస్ అధికారి భర్త డాక్టర్ రామ్ ( నవీన్ చంద్ర ) అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు పోలీస్ అధికారిణి ఏ నిర్ణయం తీసుకుంది. వరుస హత్యల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? వారిని ఎవరు చంపేశారు? ఈ మరణాల వెనుక నిజంగా అతీంద్రియ శక్తులున్నాయా? అన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే.
డైరెక్టర్ సంజీవ్ మేగోటి చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్‌కు హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కథలో మిస్టిరీయస్ అంశాల్లో ప్రేక్షకులను మెప్పించారు. హారర్, మిస్టరీ, యాక్షన్ అంశాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి.
ఇంటర్వెల్ తర్వాత కథ వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తు సన్నివేశాలు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసుల్లో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కుర్చీలో కట్టిపడేసేలా ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు బలం. సంజీవ్ సస్పెన్స్‌తో పాటు థ్రిల్లింగ్ కలిగించే కథను అందించారు. అయితే కొన్ని సీన్స్ బోర్ కొట్టేలా అనిపిస్తాయి. అక్కడక్కడ కథలో లాజిక్ మిస్సయినట్లు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కథలు ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఓసారి ట్రై చేయొచ్చు.
ఎవరెలా చేశారంటే..
నవీన్ చంద్ర తన పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దర్యాప్తు అధికారిగా మెప్పించారు. వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తన టాలెంట్‌ను ప్రదర్శించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. కృష్ణసాయి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేష్, విజయభాస్కర్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రాత్రి సీన్లు, హారర్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా బాగా తీర్చిదిద్దారు. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదు. అనుగోజు రేణుకా బాబు కొన్ని సీన్స్ మరింత కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.


