ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది: ఊర్వశి  | Urvashi Rautela Shares A Selfie With Jr NTR From The GYM, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Jr NTR And Urvashi Rautela Selfie: ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది

Published Tue, Apr 16 2024 12:09 AM

Urvashi Rautela shares a selfie with Jr NTR from the gym - Sakshi

ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్‌తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్‌ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్‌ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి.

‘వార్‌ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్‌లో ఉన్నారు ఎన్టీఆర్‌. ఆయనతో జిమ్‌లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. ‘‘ఎన్టీఆర్‌గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్‌ సూపర్‌ స్టార్‌. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌ చూసిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో అలరించారు. మరి... ఎన్టీఆర్‌ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్‌ వస్తుందా? అనేది చూడాలి.

Advertisement
 
Advertisement