విడుదల ఎప్పుడు? | Upcoming Telugu Movies Release Dates Postponed: Tollywood | Sakshi
Sakshi News home page

విడుదల ఎప్పుడు?

May 24 2026 12:25 AM | Updated on May 24 2026 12:25 AM

Upcoming Telugu Movies Release Dates Postponed: Tollywood

చిత్ర పరిశ్రమలో పలు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే ఆయా చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ని అనౌన్స్‌ చేస్తుంటారు కొందరు దర్శక–నిర్మాతలు. మరికొందరేమో చిత్రీకరణ జరుగుతున్న తీరు,పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు వంటి వాటి ఆధారంగా ఫలానా తేదీకి విడుదల చేస్తామని చెబుతుంటారు.

 ఇంకొందరేమో ఫలానా తేదీకి తప్పుకుండా వస్తాం... రిలీజ్‌ పక్కా... ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు అని బలంగా చెబుతుంటారు. అయితే షూటింగ్స్‌ ఆలస్యం కావడం..పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం... కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం... సరైన విడుదల తేదీ కుదరకపోవడం... బాక్సాఫీస్‌ వద్ద తీవ్రమైనపోటీ ఉండటం... ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు... విడుదల తేదీల్లో అనివార్యంగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల విడుదల తేదీలు ముందుగా ప్రకటించినప్పటికీ వాయిదా పడటం... మరికొన్ని చిత్రాల షూటింగ్స్,పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు పూర్తి అయినప్పటికీ ఎలాంటి రిలీజ్‌ డేట్స్‌ ప్రకటించకుండా ప్రమోషన్స్‌ మాత్రం ఫుల్‌ స్వింగ్‌లో చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం ‘విశ్వంభర, స్లమ్‌డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్, స్వయంభు, ఆపరేషన్‌ అరుణా రెడ్డి, చెన్నై లవ్‌స్టోరీ, సంబరాల ఏటిగట్టు, కొరియన్‌ కనకరాజు’ వంటి సినిమాల రిలీజ్‌ డేట్స్‌పై ఎలాంటి స్పష్టత లేదు. ఈ చిత్రాల విడుదల ఎప్పుడు? అన్నది సగటు సినీ ప్రేమికుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఎదురు చూడాల్సిందే. ఇక వాయిదా పడుతూ వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...

విశ్వంభరుడి రాక కోసం...
చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ హీరోగా ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తెరకెక్కించిన మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపా ట  ఈ మూవీ నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే 2025 సంక్రాంతి బరిలో సందడి చేయాల్సి ఉంది.

జనవరి 10న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పకుండా సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అనుకున్నారంతా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన పా న్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు.  శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేసినట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఇప్పటికీ వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో మూవీ విడుదల తేదీ విషయంలో చిత్రబృందం సందిగ్ధతను కొనసాగిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమాని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అంటూ తన పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 22న చిరంజీవి ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయిదే వేసవి మొదలై ఇప్పటికే సగానికి పైగా అయినప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు మేకర్స్‌.

ఇదిలా ఉంటే చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ (2002 జూలై 24 రిలీజైంది) విడుదల తేదీ అయిన జూలై 24ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరి ఆ తేదీకి అయినా ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా ఆగస్టులో విడుదలవుతుందా? అదీ కుదరకుంటే దసరా కానుకగా అక్టోబరులో రిలీజ్‌ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ‘విశ్వంభర’ రిలీజ్‌పై మేకర్స్‌ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.  

టెంపుల్‌ రోడ్‌లో...
దర్శకుడు పూరి జగన్నాథ్‌ శైలి ప్రత్యేకమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాని శరవేగంగా అనుకున్న సమయంలో పూర్తి చేయగలరనే పేరుంది ఆయనకు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌’ షూటింగ్‌ కూడా ఆయన స్టైల్‌లో స్పీడుగానే సాగిందని టాక్‌. అయితే విడుదల తేదీ విషయంలోనే సందిగ్ధం నెలకొందట. విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించారు. టబు, బ్రహ్మాజీ, దునియా విజయ్‌కుమార్‌ ఇతర కీలక పాత్రలుపోషించారు. చార్మీ కౌర్‌ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోహన్‌ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించారు. ఈ మూవీ చిత్రీకరణ,పోస్ట్‌ ప్రోడక్షన్, రీ–రికార్డింగ్‌ పనులు పూర్తి అయినప్పటికీ రిలీజ్‌ డేట్‌ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు.

‘‘పూరి మార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్, ఎంటర్‌టైనర్, ఇంటెన్స్  ఎమోషన్స్, రా యాక్షన్  నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ‘స్లమ్‌ డాగ్‌’కి తనదైన శైలిలో స్వరాలు అందించారు. ప్రత్యేకించి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ పా న్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కానుంది. చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా 26 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో ‘స్లమ్‌ డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌’ స్పెషల్‌ ఫిల్మ్‌గా గుర్తుండిపోతుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

స్వయంభు... 
‘కార్తికేయ 2’(2022)వంటి పా న్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ తర్వాత నిఖిల్‌ హీరోగా నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఠాగూర్‌ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్‌ నిర్మించారు. భారీ పీరియాడికల్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్‌ భాషల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. నిఖిల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం  ‘స్వయంభు’.

ఈ సినిమాలో నిఖిల్‌ ఒక పవర్‌ఫుల్‌ వారియర్‌ పా త్రలో కనిపించనున్నారు. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రా ంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అతను అండర్‌ డాగ్‌ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందట. ఈ క్యారెక్టర్‌లో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్‌ ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. తన కెరీర్‌లో ‘స్వయంభు’ని ఒక మైలురాయిగా భావించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు నిఖిల్‌. ఈ మూవీ టీజర్‌లోని విజువల్స్, భారీతనం, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందన రావడంతో పా టు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.

‘కేజీఎఫ్, సలార్‌’ మూవీస్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఏప్రిల్‌ 16న విడుదల చేసిన తొలి పా ట ‘రా రా ధీవర’కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘స్వయంభు’ని తొలుత 2026 ఫిబ్రవరి 13న రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ అనౌన్స్  చేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 10కి విడుదల వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్‌ కాలేదు. అలాగే ఆ తర్వాత ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్‌లో విడుదల కానుంది.

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కి కేవలం తెలుగులో సరైన విడుదల తేదీ కుదిరితే సరిపోదు. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలకు గట్టిపోటీ లేకుండా ఉండే తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడి మార్కెట్‌ని కూడా జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది మేకర్స్‌. మరి వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని ‘స్వయంభు’ కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది చిత్రయూనిట్‌ ప్రకటించే వరకు వేచి చూడాలి.

ఆపరేషన్‌ అరుణారెడ్డి
నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత... ఇలా మల్టీ టాలెంటెడ్‌ పర్సన్‌గా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారుపోసాని కృష్ణమురళి. శ్రీకాంత్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘దుశ్శాసన’. 2011 మే 27న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ తర్వాత నటుడిగా బిజీ అయినపోసాని కృష్ణమురళి కొన్నేళ్ల పా టు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మూవీ ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’. ఆయన కీలక పా త్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది.

ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టడంతో పా టు తొలిసారి రెండు పా టలు కూడా రాయడం విశేషం. హిందోళ చక్రవర్తి టైటిల్‌ రోల్‌ చేసిన ఈ సినిమాలోపోసాని కృష్ణమురళి, కాజల్‌ శర్మ, ఆయేషా ఖాన్, ఎంపీ రఘునందన్‌ రావు ఇతర ప్రధాన పా త్రలుపోషించారు.  3 ఇడియట్స్‌ మూవీస్‌ సమర్పణలో యూపీ సినిమా లైన్స్ , కుసుమ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రూపొందిన ఈ చిత్రంపోస్ట్‌ ప్రోడక్షన్, సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటికీ సినిమా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు.

‘‘నిజాయితీపరులైన జర్నలిస్టుల కథతో ‘ఆపరేషన్‌ అరుణారెడ్డి’ రూపొందింది. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుందనేది కథాంశం. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్‌గా హిందోళ చక్రవర్తి  నటించారు. కొందరు చేసిన రాజకీయాలకు ఓ మంచి జర్నలిస్ట్‌ రోడ్డున పడే పరిస్థితి వస్తే.. ఇలాంటి నిజాయతీ కలిగిన అమ్మాయి జర్నలిజంలో ఉండాలని ముఖ్యమంత్రి అండగా నిలబడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథనం ఆసక్తిగా ఉంటుంది. సినిమా ప్రా రంభం నుంచి చివరి దాకా తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకుల ఊహకు కూడా అందదు. స్క్రీన్‌ప్లే అంత అద్భుతంగా ఉంటుంది.  ఈ నెలాఖరులో లేదా జూన్‌లో మా సినిమాని విడుదల చేస్తాం’’ అంటూపోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.

కొరియన్‌ కనకరాజు... 
వరుణ్‌ తేజ్‌ హీరోగా నటì ంచిన తాజా చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ మూవీ ఫేమ్‌ మేర్లపా క గాంధీ రచన–దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘మిరాయ్‌’ మూవీ ఫేమ్‌ ‘రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, నటుడు సత్య కీలకపా త్రపోషించారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయినప్పటికీ విడుదల ఎప్పుడు? అన్నది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ‘‘వరుణ్‌ తేజ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్ , మేర్లపా క గాంధీ హిలేరియస్‌ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్ –ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ నిర్మాణ విలువలతో ‘కొరియన్‌ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది.

హారర్, కామెడీ, ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్‌ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్‌ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పా త్రపోషించారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా ట్రాన్స్ ఫార్మ్‌ అయ్యారాయన. రితికా నాయక్‌ చక్కని నటనతో ఆకట్టుకుంటారు. సత్య కామెడీ టైమింగ్‌తో మరోసారి నవ్వులు పండిస్తారు. వినోదం, యాక్షన్, హారర్‌ని మేళవిస్తూ మేర్లపా క గాంధీ ఈ మూవీ తెరకెక్కించారు.

కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. తమన్‌ సంగీతం అందించిన మా సినిమా నుంచి విడుదల చేసిన             ‘కమ్సాహం నిదా...’ పా టకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వేసవిలో సినిమాని విడుదల చేస్తాం’’ అంటూ చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే... వేసవిలో రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించినప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

చెన్నై లవ్‌ స్టోరీ 
కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్‌ స్టోరీ’. ‘కలర్‌ ఫొటో, బేబి’ చిత్రాల దర్శకుడు సాయి రాజేష్‌ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శ్రీ గౌరీప్రియ హీరోయిన్‌గా నటించారు. అమృత ప్రోడక్షన్స్ , మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్స్‌పై సాయి రాజేష్, ఎస్‌కేఎన్‌ నిర్మించారు. చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కానప్పటికీ మేకర్స్‌ మాత్రం ప్రమోషనల్‌ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ‘‘మణిశర్మ సంగీతం అందించిన మా మూవీ నుంచి విడుదల చేసిన తొలి పా ట ‘గుర్తుందా...’ కి అనూహ్యమైన స్పందన వచ్చింది.

మా సినిమాను జూన్‌ 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం’’ అంటూ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎస్‌కేఎన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘చెన్నై లవ్‌ స్టోరీ’ మూవీ డాల్బీలో చేయడం సంతోషంగా ఉంది. రవి నంబూరితో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. ‘గుర్తుందా...’ పా ట కోసం కోటి రూపా యలు ఖర్చు చేసి సెట్‌ వేశారు. ‘రాజా వారు రాణి గారు’ మూవీ తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్‌గా ఉండే క్యారెక్టర్‌ చేశాను.

మా మూవీ ప్రమోషన్‌ కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ , సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఏడు పా టలు కంపోజ్‌ చేశారు. ఆ పా టల్ని అందరూ థియేటర్స్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్‌ అయిన రోజు థియేటర్స్‌లో మ్యూజిక్‌ కన్సర్ట్‌ జరిగినట్లు ఉంటుంది. ఇండియన్‌ సినిమా గ్రేటెస్ట్‌ లవ్‌ స్టోరీస్‌లో ఒకటిగా మా ‘చెన్నై లవ్‌ స్టోరీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని కిరణ్‌ అబ్బవరం పేర్కొన్నారు.

సంబరాల ఏటిగట్టు... 
సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఎస్‌వైజీ’(సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పా త్రలుపోషించారు.  ‘హను–మాన్‌’(2024) వంటి పా న్‌ ఇండియన్‌ హిట్‌ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కోసం సాయిదుర్గా తేజ్‌ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్‌ అయ్యారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్‌పోస్ట్‌పోన్‌ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల విషయంపై ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే సందిగ్ధం నెలకొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.

టాక్సిక్‌...
‘కేజీఎఫ్‌ 1, 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత యశ్‌ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ హీరోయిన్లుగా నటించారు. కేవీఎన్‌ ప్రోడక్షన్స్ , మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్  పతాకంపై వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత ‘దిల్‌’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే... ఈ మూవీని తొలుత మార్చి 19న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే  మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌లో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మార్చి 19 నుంచి జూన్‌ 4కు రిలీజ్‌ని పోస్ట్‌పోన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. కానీ, జూన్‌ 4న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ కూడా మరోసారి మారనుంది. త్వరలోనే కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్‌. ‘‘సినిమాకాన్ లో ‘టాక్సిక్‌’ని ప్రదర్శించిన తర్వాత ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అక్కడ వచ్చిన స్పందన చూసిన తర్వాత ఇది వరల్డ్‌ వైడ్‌గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యాలను కాంటాక్ట్‌ అవుతున్నాం. 

ఈ నేపథ్యంలో మా సినిమా విడుదల తేదీని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నాం. గతంలో ప్రకటించినట్లుగా జూన్‌ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలోనే చెబుతాం. భారతీయ సినిమా తన సత్తాను వరల్డ్‌వైడ్‌గా చాటుతూ గొప్ప భవిష్యత్తుతో ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో దాని స్థాయిని మరింత పెంచాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది.

ఒక నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ కోసం, మనందరి కోసం నా వంతు పా త్రపోషించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. కొన్ని కథలకు సహనం అవసరం. కొన్ని ప్రయాణాలకు అది తప్పనిసరి. మీరు ఆస్వాదించి, వేడుక చేసుకునే ఒక చిత్రాన్ని మీకు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక గర్వకారణంగా నిలిచే చిత్రం ఇది’’ అని యశ్‌ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

 మరికొన్ని చిత్రాల విడుదల తేదీల పైనా మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.  

– డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement
 
Advertisement
Advertisement