చిత్ర పరిశ్రమలో సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటిస్తుంటారు కొందరు మేకర్స్. మరికొందరు సినిమా షూటింగ్, ఔట్‌పుట్, పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. ఇంకొందరేమో సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండగలతో పాటు వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాలను ఫలానా తేదీకి విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు ఒక్కోసారి ఉండక పోవచ్చు.
షూటింగ్స్ ఆలస్యం, పోస్ట్ ప్రోడక్షన్, వీఎఫ్‌ఎక్స్, డేట్స్ క్లాష్... వంటి కారణాల వల్ల సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు జరుగుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయింది. ఏది ఏమైనా కానీ కంటెంట్, ఔట్‌పుట్, క్వాలిటీ... ఇలా ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తాం అంటున్నారు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకున్న కొందరు దర్శక–నిర్మాతలు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, ఎన్‌టీఆర్ ‘ఎన్‌టీఆర్‌నీల్’, రామ్‌చరణ్ ‘ పెద్ది’, నాని ‘ది ప్యారడైస్’, అఖిల్ ‘లెనిన్’, నిఖిల్ ‘స్వయంభు’, సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, తమిళ హీరో విజయ్ ‘జన నాయగన్’ వంటి సినిమాల విడుదల తేదీలు ముందే ఖరారు అయినప్పటికీ వాయిదా పడ్డాయి. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...
విశ్వంభర ఎప్పుడు?
చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం తన ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేసుకున్నారు చిరంజీవి. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న రిలీజ్ చేశారు. ‘‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘దిల్’ రాజుగారు అడగడంతో ‘విశ్వంభర’ సినిమా విడుదలను వాయిదా వేశాం’’ అంటూ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి విడుదల వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని అందరూ భావించినప్పటికీ రిలీజ్ కాలేదు. 2025 మే 9న సినిమా విడుదల కానుందనే వార్తలు గతంలో వినిపించాయి. ఆ తర్వాత జూలై 24న ‘విశ్వంభర’ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ రాలేదు.
సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌కి ప్రాధాన్యం ఉందట. ఈ పనుల ఆలస్యం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తన పుట్టినరోజున (ఆగస్టు 22) చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేసి, ‘‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే వేసవి మొదలైనప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు మేకర్స్. మరి... ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెన్నడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు.
జూన్‌లో ఎన్టీఆర్ నీల్?
‘దేవర: పార్ట్ 1’ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్ 1, 2, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో కాస్త బొద్దుగా కనిపించే ఆయన మరో పాత్ర కోసం బాగా సన్నబడ్డారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోని ఇటీవల ఆయన షేర్ చేయగా కండలు తిరిగిన దేహంతో ఉన్న ఈ పిక్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతిదీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్, అలాగే సుమారు 2000 మందితో తెరకెక్కించిన ఓ పాట, హైదరాబాద్ సమీపంలోని ఓ స్టూడియోలో సుమారు రూ. 15 కోట్ల తో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ని నిర్మించడం హైలెట్‌గా మారాయి.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి సినిమాని రిలీజ్ చేయడం లేదని యూనిట్ ప్రకటించింది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అన్నది వేచి చూడాలి.
జూన్‌లో పెద్ది రెడీ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండి యన్ మూవీ ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో (2021) బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ కోసం రామ్‌చరణ్ ఫుల్æమాస్ లుక్‌లోకి మారి పోయారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లకి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి..., రై రై రారా...’ పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘పెద్ది’ నుంచి విడుదల చేసిన రామ్ చరణ్ శక్తివంతమైన కొత్త పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే... రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా 2026 మార్చి 27న ‘పెద్ది’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ రెండోసారి వాయిదా వేశారు.
జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘మాపై మీరు (ప్రేక్షకులు) చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్‌తో వస్తాం. విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని ‘పెద్ది’ చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... సినిమాలోని టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్, నేపథ్య సంగీతం మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఆగస్టులో ప్యారడైస్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ చిత్రంలో నానీని ఫుల్ మాస్ లుక్‌లో చూపించారు శ్రీకాంత్ ఓదెల. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషి స్తున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించగా అద్భుతమైన స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది.
అయితే మార్చి 27న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో డేట్స్ క్లాష్ అయ్యే కారణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఉండక పోవచ్చనే చర్చ జరిగింది కూడా. అనుకున్నట్టుగానే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ దాదాపు పూర్తయినప్పటికీ టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అందుకే లేట్ అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా లేటెస్ట్‌గా ఆడియన్స్ ముందుకు రావాలన్నది మేకర్స్ ఆలోచన.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 21న ‘ది ప్యారడైస్’ రిలీజ్ డేట్‌కి వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసొస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీ ఫిక్స్ చేసినట్లు టాక్. కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి నానీపై ఇప్పటికే విడుదల చేసిన ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
లెనిన్ డేట్ ఫిక్స్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘లెనిన్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం పక్కా మాస్ లుక్‌లోకి మారి పోయారు అఖిల్. పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో మేకోవర్ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. పైగా రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగులకు కూడా మంచి స్పందన వస్తోంది.
తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘వారేవా వారేవా...’కి చాలా మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఈ నెల 16న ఈ మూవీలోని ‘ఎట్టా ఎట్టా..’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. అఖిల్ తన మాస్ స్టెప్స్‌తో అదరగొట్టగా, భాగ్యశ్రీ తన చార్మ్‌తో మెప్పించారు. ఇదిలా ఉంటే... ‘లెనిన్’ని మే 1న విడుదల చేయనున్నట్లు తొలుత అధికారికంగా ప్రకటించింది యూనిట్. అయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలను మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండు సినిమాల మధ్య కేవలం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీ విడుదలను మే 1వ తేదీ నుంచి జూన్ 26వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే అనూహ్యంగా ‘పెద్ది’ సినిమా కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్‌కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ లెక్కన చూస్తే ఇటు ‘పెద్ది’, అటు ‘లెనిన్’ సినిమాలు జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘లెనిన్’. బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథతో మురళీ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. మా మూవీ ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.
మేలో స్వయంభు
‘కార్తికేయ 2’ (2022) సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకోవడంతో పాటు అదే స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తొలుత అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే టాకీ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి కూడా రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేశారు. అయితే కొత్త విడుదల తేదీ ఎప్పుడనే విషయాన్ని చిత్రయూనిట్ స్పష్టం చేయాలి. వార్తల్లో ఉన్న ప్రకారం మేలో విడుదలయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారాయన. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాక పోవడంతో రిలీజ్ వాయిదా పడిందని ఫిల్మ్‌నగర్ టాక్.
ఈ మూవీని 2డీ, త్రీడీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ‘‘దర్శకుడు భరత్ కృష్ణమాచారి తన విజన్‌ను ‘స్వయంభు’లో భారీ స్థాయిలో ప్రజెంట్ చేశారు. ప్రత్యేకించి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. ‘స్వయంభు’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్ పేర్కొంది.
సంబరాలు ఎప్పుడు?
సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ రూపొందించారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాల విడుదల తేదీల్లోనూ మార్పులు జరిగే అవకాశం లేక పోలేదు.
– డేరంగుల జగన్ మోహన్


