ఆలస్యమైనా... అలరిస్తాం | Upcoming Movies Postponed in Tollywood | Sakshi
Sakshi News home page

ఆలస్యమైనా... అలరిస్తాం

Aug 29 2025 12:58 AM | Updated on Aug 29 2025 12:58 AM

Upcoming Movies Postponed in Tollywood

చిత్ర పరిశ్రమలో వరుస సినిమాల రిలీజ్‌లు వాయిదా 

ఇండస్ట్రీపై సమ్మె ప్రభావం 

వీఎఫ్‌ఎక్స్‌ పనులతో వాయిదా పడ్డ భారీ చిత్రాలు

చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్‌లు వాయిదా పడటం సాధారణమే. కానీ రిలీజ్‌లు దగ్గర పడుతున్న తరుణంలో విడుదల వాయిదా పడుతున్న సినిమాల సంఖ్య ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో పెరిగింది. ఆగస్టు నెలలో సినీ కార్మికుల సమ్మె ఓ కారణమైతే, భారీ చిత్రాల వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌కి ఎక్కువ టైమ్‌ పట్టడం మరో కారణం... ఇలా పలు కారణాల వల్ల సినిమా రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. కానీ అందరు మేకర్స్‌ చెబుతున్న మాట ఒకటే...‘ఆలస్యమైనా... అలరిస్తాం’ అని. అలా లేట్‌ అయినా లేటెస్ట్‌గా వస్తామంటున్న కొన్ని చిత్రాల గురించి ఓ లుక్‌ వేద్దాం.

వేసవిలో విశ్వంభర 
విశ్వంభర చిత్రం ఈ ఏడాది థియేటర్స్‌లోకి రావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. సంక్రాంతి రిలీజ్‌ వాయిదా పడిన తర్వాత ‘విశ్వంభర’ చిత్రం ఈ ఏడాది చివర్లో అయినా రిలీజ్‌ అవుతుందని మెగా ఫ్యాన్స్‌ ఆశించారు. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ అయ్యేది లేదంటూ ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్‌ను వచ్చే వేసవికి వాయిదా వేశారు. వచ్చే ఏప్రిల్‌లో ‘విశ్వంభర’ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహించారు.

త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ చిత్రంలో  ఆంజనేయస్వామి భక్తుడు భీమవరం దొరబాబు  పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి.. చిరంజీవి సిస్టర్స్‌గా కనిపిస్తారని, త్రిష ద్వి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి మౌనీ రాయ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. పధ్నాలుగు లోకాలు దాటి హీరో సత్యలోకానికి ఎలా చేరుకున్నాడు? అక్కడ హీరోయిన్‌ను ఎలా కలుసుకున్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మించారు.

దసరా బరిలో లేదు
హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయ పాటి శీను కాంబినేషన్‌లో రూ పొందుతున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాను ఈ దసరా ఫెస్టివల్‌ సందర్భంగా సెప్టెంబరు 25న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ దసరా బరి నుంచి ‘అఖండ 2’ చిత్రం తప్పుకుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు.

వీఎఫ్‌ఎక్స్‌ పనులు, రీ–రికార్డింగ్‌ పనులతో  పాటు మొత్తం పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని ఈ కారణంగా ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామని, ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఓ సెలబ్రేషన్‌లా ఉంటుందని చెబుతూ, ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌ వాయిదాను గురువారం కన్ఫార్మ్‌ చేశారు మేకర్స్‌. కాగా ఈ చిత్రం డిసెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బాలకృష్ణ, బోయ పాటి కాంబినేషన్‌లో రూ పొందిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు.

సంక్రాంతి బరిలో... 
వచ్చే సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్‌’ చిత్రం నిలిచింది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్‌ కామెడీ యాక్షన్‌ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటించగా, సంజయ్‌ దత్, వీటీవీ గణేశ్‌ తదితరులు కీలక  పాత్రల్లో నటించారు. తొలుత ‘ది రాజాసాబ్‌’ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ ఆ తర్వాత డిసెంబరు 5న రిలీజ్‌ చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా ‘ది రాజాసాబ్‌’ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్‌ చేస్తున్నట్లుగా ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కన్ఫార్మ్‌ చేశారు.

దీంతో డిసెంబరు 5 నుంచి జనవరి 9కి ‘ది రాజాసాబ్‌’ సినిమా వాయిదా పడినట్లు, అధికారిక సమాచారం వెల్లడైంది. ఇక తాత–మనవడు నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రదర్శకుడు మారుతి స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్‌– ప్రభాస్‌ తాత–మనవడు  పాత్రల్లో కనిపిస్తారని, ‘రాజా డీలక్స్‌’ అనే ఓ భవనం నేపథ్యంలో ఈ సినిమా మేజర్‌ కథనం సాగుతుందని తెలిసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ హైదరాబాద్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి కాగానే, సెప్టెంబరులో కేరళ వెళుతుంది చిత్ర యూనిట్‌. అక్కడ ప్రభాస్‌  పాత్ర తాలూకు ఇంట్రడక్షన్‌ సాంగ్‌ తీస్తారట. ఆ నెక్ట్స్‌ విదేశాల్లో హీరో – హీరోయిన్లపై చిత్రీకరించే డ్యూయెట్‌ సాంగ్‌లతో ‘ది రాజాసాబ్‌’ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ పూర్తవుతుందని తెలిసింది. ఫ్యాంటసీ హారర్‌ కామెడీ సినిమా కనుక, వీఎఫ్‌ఎక్స్‌–΄ోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌పై స్పెషల్‌ కేర్‌ తీసుకుంటోందట చిత్రయూనిట్‌. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 మాస్‌ జాతర 
రవితేజ కెరీర్‌లోని 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టారు. అలాగే ఈ సినిమాలో మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌  పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇందులో రవితేజ లక్ష్మణ్‌ భేరి అనే రైల్వే పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

షూటింగ్‌ ఆల్మోస్ట్‌ పూర్తి కావొచ్చింది. అయితే ఈ వినాయక చవితి ఫెస్టివల్‌ సందర్భంగా రిలీజ్‌ కావాల్సిన ‘మాస్‌ జాతర’ చిత్రం వాయిదా పడింది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమ్మె పరిస్థితులు, కొన్ని ఊహించని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను ఈ ఆగస్టు 27న రిలీజ్‌ చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలి పారు. అయితే ‘మాస్‌ జాతర’ సినిమా రిలీజ్‌ వాయిదా పడటం ఇదేం తొలిసారి కాదు.

నిజానికి ఈ సినిమాను తొలుత 2025 సంక్రాంతి రిలీజ్‌కి  ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత మే 9కి, ఆ నెక్ట్స్‌ ఆగస్టు 27కి రిలీజ్‌  ప్లాన్‌ చేశారు. కానీ ఈ తేదీల్లో రిలీజ్‌ కుదర్లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు  ప్రారంభంలో ‘మాస్‌ జాతర’ చిత్రం విడుదల కావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర విలన్‌గా చేస్తున్నారని తెలిసింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హీరో వర్సెస్‌ డైరెక్టర్‌ 
ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకునే ఓ హీరో, ఓ డైరెక్టర్‌ మధ్య ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? అసలు వీరి మధ్య ఏం జరిగింది? అన్న అంశాలతో రూ పొందిన పీరియాడికల్‌ చిత్రం ‘కాంత’. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ చంద్రన్‌  పాత్రలో దుల్కర్‌ సల్మాన్, లెజెండరీ డైరెక్టర్‌ అయ్యా  పాత్రలో సముద్ర ఖని నటించారు. ఈ సినిమాలో  హీరోయిన్‌  పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటించారు.

ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబరు 12న రిలీజ్‌ అంటూ రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించారు మేకర్స్‌. కానీ 1950 మద్రాస్‌ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ సినిమా సెప్టెంబరు 12న రిలీజ్‌ కావడం లేదని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించనున్నారు మేకర్స్‌. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌  పొట్లూరి, జోయ్‌ వర్గీస్‌ ఈ సినిమాను నిర్మించారు.

తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో... 
‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘మిరాయ్‌’. ఈ చిత్రంలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్‌ విలన్‌ రోల్‌ చేశారు. జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సూపర్‌ యోధ  పాత్రలో తేజ సజ్జా, బ్లాక్‌స్వార్డ్‌  పాత్రలో మంచు మనోజ్‌ నటించారు.

ఈ సినిమాను తొలుత ఆగస్టు 1న రిలీజ్‌ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 5న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. కానీ తాజాగా వారం రోజులు ఆలస్యంగా... అంటే సెప్టెంబరు 12న రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ చిత్రం ప్రధానంగా తొమ్మిది గ్రంథాలు, ఓ మ్యాజికల్‌ స్టిక్‌ నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది.

ప్రేమలో సంఘర్షణ 
రష్మికా మందన్నా లీడ్‌ రోల్‌లో నటించిన తొలి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ఈ లవ్‌స్టోరీ చిత్రంలో దీక్షిత్‌ శెట్టి మరో లీడ్‌ రోల్‌లో నటించారు. రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమా నిర్మించారు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. అయితే ఈ సినిమాను సెప్టెంబరు 5న రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్‌. కానీ ఈ సెప్టెంబరు 5న ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం విడుదల కావడం లేదని, త్వరలోనే మేకర్స్‌ నుంచి కొత్త విడుదల తేదీ వస్తుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ప్రేమలో ఓ యువతి పడే సంఘర్షణ తాలూకు అంశాలతో ఈ చిత్రకథనం సాగుతుందని తెలిసింది.  

సంబరాలు ఎప్పుడు? 
రాయలసీమ నేపథ్యంలో రూ పొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్‌ హీరోగా నటిస్తున్నారు. రోహిత్‌ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను గతంలో సెప్టెంబరు 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటంచారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌ గురించి, మరో అప్‌డేట్‌ లేక΄ోవడంతో ఈ మూవీ సెప్టెంబరు 25న రిలీజ్‌ కావడం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ 75 శాతం పూర్తయిందని ఓ సందర్భంలో మేకర్స్‌ తెలి పారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది.

కోచింగ్‌ సెంటర్ల నేపథ్యంలో... 
చాలా సినిమాల రిలీజ్‌లు పోస్ట్‌΄ోన్‌ అవుతుంటే చిన్న చిత్రం ‘లిటిల్‌ హార్ట్స్‌’ రిలీజ్‌ మాత్రం ప్రీ పోన్‌ అయ్యింది. ‘90స్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌‘ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్‌ రోల్స్‌లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘లిటిల్‌ హార్ట్స్‌’. ‘90స్‌ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ డైరెక్టర్‌ ఆదిత్య హాసన్‌ ఈ సినిమాను నిర్మించారు. సాయి మార్తాండ్‌ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను తొలుత సెప్టెంబరు 12న రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ సెప్టెంబరు 5కి ఈ సినిమాను ప్రీ పోన్‌ చేశారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు. టీనేజ్‌ పిల్లల చదువు, లవ్‌స్టోరీ, కోచించ్‌ సెంటర్లు.. వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. 

ఈ తరహాలో రిలీజ్‌ వాయిదా పడిన సినిమాలు, కొత్త రిలీజ్‌ డేట్‌లను కన్ఫార్మ్‌ చేసుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.  – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement