వాలెంటైన్స్‌ డే స్పెషల్.. టాలీవుడ్ ప్రేమ జంటలు! | From Allu Arjun To Nani, Tollywood Love Stories On This Valentines Day Special In Telugu - Sakshi
Sakshi News home page

Tollywood Love Stories: వాలెంటైన్స్‌ డే స్పెషల్.. ప్రేమబంధంతో ఒక్కటైన టాలీవుడ్ స్టార్స్!

Published Wed, Feb 14 2024 8:20 AM

Tollywood Love Stories On The Valentines Special Day - Sakshi

మరో ఏడాదిలో వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు. ప్రేమ అనే రెండు అక్షరాలను.. పెళ్లి వరకు తీసుకెళ్లిన వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. రెండు అక్షరాలతో మొదలై.. అదే రెండక్షరాల పెళ్లిగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇవాళ వాలెంటైన్స్‌ డే సందర్భంగా అలా ప్రేమలో పడి.. పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్‌ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్‌ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ సక్సెస్‌ అయిన ప్రేమకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. నాగార్జున-అమల:

మొదట కిరాయి దాదా మూవీ సెట్స్‌లో కలుసుకున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992లో (జూన్ 11న) వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు.  అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. ఆ తర్వాత కూడా ఒకటి,రెండు సినిమాల్లో నటించింది.

2. రాజశేఖర్-జీవిత:

తెలుగు స్టార్‌ హీరోల్లో రాజశేఖర్ అంటేనే ఓ స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్‌ సినిమాల్లో నటించారు. మొదట జీవితనే  రాజశేఖర్‌కు ప్రపోజ్ చేశారు. ఆ త‍ర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్‌మాస్టర్‌, అంకుశం, బావ మరుదుల సవాల్‌ లాంటి చిత్రాలు వీరిద్దరూ కలిసి జంటగా నటించారు.

3. శ్రీకాంత్-ఊహా:

1994లో  ‘ఆమె’ సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీకాంత్‌, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయనగారు లాంటి చిత్రాల్లో కలిసి నటించారు ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997  జనవరి 20న పెళ్లితో పదిలపర్చుకున్నారు. వీరి పెళ్లయిన ఏడాది తర్వాత ఆయనగారు చిత్రం విడుదలైంది.


4. మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్:

2000వ సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్‌ - నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగించారు.   ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

5. అల్లు అర్జున్-స్నేహ:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా.. అల్లు అర్జున్ ఓ స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు.  ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం.. రోజూ ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్- స్నేహరెడ్డిల  2011న  మార్చి 6న జరిగింది. 

6. రామ్ చరణ్-ఉపాసన:

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ‘ఆరేంజ్’ సినిమా నుంచి వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కుటుంబాల అంగీకారంతో జూన్ 14, 2012న వివాహం చేసుకున్నారు. అపోలో హాస్పిటల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు ఉపాసనకు సినిమాలతో సంబంధం లేదు. 

7. లక్ష్మి మంచు-ఆండీ శ్రీనివాసన్:

మోహన్‌ బాబు కూతురు లక్ష్మి మంచు.. ఆండీ శ్రీనివాసన్‌ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి వివాహానికి షాపింగ్‌కు వెళ్లినప్పుడు అతన్ని మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆండీ, లక్ష్మి ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట  ఆగస్ట్ 4న 2006లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు.  


8. నాని-అంజనా యలవర్తి:

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ప్రేమజంట నాని-అంజనా యలవర్తి. నాని భార్య అంజన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నాని విశాఖపట్నంలో వీడియో జాకీ(వీజే)గా ఉన్నప్పుడు అంజనా ఓ పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్‌లో స్నేహితులుగా మారిన వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించారు. ఐదేళ్లపాటు డేటింగ్‌ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత చివరకు  27 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు.

9. నాగ చైతన్య-సమంత:

2009లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్స్‌లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. చైతూ సూపర్ హిట్ ప్రేమమ్ చిత్రంలో సామ్ అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే 2021లోనే నాగచైతన్య- సమంత తమ వివాహాబంధానికి ముగింపు పలికారు. 

10. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి

మెగా హీరో వరుణ్ తేజ్  గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్.. నవంబర్ 1న 2023న పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్‌లో జంటగావరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది.  

11.మంచు మనోజ్- భూమా మౌనిక

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు. మంచు లక్ష్మీ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. 

12.సూపర్‌ స్టార్‌ కృష్ణ- విజయ నిర్మల

సూపర్‌ స్టార్‌ కృష్ణ ‘సాక్షి’ సినిమాలో విజయ నిర్మలతో జోడీ కట్టారు. ఇద్దరి మనసులు కలవడంతో 1969లో రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లే అయినప్పటికీ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్య దంపతులగా గుర్తింపు తెచ్చుకున్నారు.

వీరితో పాటు ఇంకా టాలీవుడ్‌లో ప్రేమవివాహం చేసుకున్నా స్టార్స్ కూడా ఉన్నారు. సుమంత్- కీర్తి రెడ్డి, బాలాజీ-మధుమిత, వరుణ్ సందేశ్- వితికా షేరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. 

Advertisement
Advertisement