సినీ నటి రేణు దేశాయ్ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. రేణు దేశాయ్‌ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.
సోషల్‌మీడియా వేదికగా ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.


