
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశారు. చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, నాని, నితిన్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ వంటి హీరోల చేతిలో ముచ్చటగా మూడు ప్రాజెక్టులున్నాయి. మరికొందరు నాలుగు సినిమాలు చేస్తున్నారు... ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం..
చిరంజీవి... భలే జోరు
తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి భలే జోరుమీదున్నారు. ఈ సీనియర్ హీరో వరుసగా ప్రతిభావంతులైన యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి వంటి స్టార్‌తో అందివచ్చిన అవకాశాన్ని నిరూపించుకుని, ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో దర్శకులు సైతం ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’.
‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ఠ మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధం అవుతోంది.
చిరంజీవి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కాంబినేషన్ చాలా రోజుల తర్వాత ‘విశ్వంభర’తో రిపీట్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘విశ్వంభర’ తర్వాత కూడా చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌తో పని చేయనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నట్లు చిరంజీవి ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలాగే తొలి చిత్రం ‘దసరా’తో (నాని హీరో) సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి పచ్చజెండా ఊపారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ మూవీ రూపొందిస్తున్నారు. మరి చిరంజీవి ముందుగా అనిల్ మూవీని సెట్స్‌కి తీసుకెళతారా? శ్రీకాంత్ ఓదెల మూవీ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీ దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
పవన్ కల్యాణ్... తీన్‌మార్
‘బ్రో’ (2023) సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరపై కనిపించలేదు. ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారాయన. ప్రస్తుతం ఆయన చేతిలో కూడా మూడు చిత్రాలున్నాయి. వాటిలో ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్యప్రోడక్షన్స్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని టాక్. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ అనే ఓ మూవీ చేస్తున్నారు పవన్. అలాగే ‘గబ్బర్ సింగ్’ తర్వాత హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రభాస్... ఫుల్ స్వింగ్
‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు హీరో ప్రభాస్. ఆ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారాయన. గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో (‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్ర) బిజీ బిజీగా ఉన్నారు.
మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ‘ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అలాగే మంచు విష్ణు హీరోగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్రుడిగా అతిథి పాత్ర చేశారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్: పార్ట్ 1–సీజ్‌ఫైర్’కి కొనసాగింపుగా ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’ రూపొందనున్న సంగతి తెలిసిందే.
హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘సలార్: పార్ట్ 2–శౌర్యాంగ పర్వం’తో పాటు మరో రెండు సినిమాలు ప్రభాస్ తమ బ్యానర్‌లో చేయనున్నట్లు హోంబలే ఫిల్మస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027, 2028లో వరుసగా ఈ సినిమాలు విడుదలవుతాయి.
నితిన్... జోరుగా
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ’ మూవీతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ 2024ని మిస్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో జోరుగా ఉన్నారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.
అదే విధంగా ‘వకీల్ సాబ్’ మూవీ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నారు నితిన్. ఇందులో సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో నితిన్‌కి అక్కగా లయ నటిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలానే తొలి మూవీ ‘బలగం’తో బంపర్ హిట్ సాధించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేయనున్నారు నితిన్. ఏప్రిల్ లేదా మేలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుందట.
ఎన్టీఆర్... యమా స్పీడు
‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్ యమా స్పీడుమీదున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని ప్రెజంట్ చేయనున్నారు ప్రశాంత్ నీల్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్.
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల శివ. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ఫిల్మ్‌నగర్ టాక్.
నాని... ఫుల్ జోష్
హీరో నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ వైపు హీరోగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారాయన. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్‌ప్రోడక్షన్స్ తో కలిసి నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నాని.
‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా ఈ చిత్రం రానుంది. ఇదిలా ఉంటే... ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఫుల్ రా రస్టిక్ పాత్ర చేస్తున్నారు నాని.
తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో 2026 మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రెండు సినిమాల తర్వాత ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు నాని. భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీ నిర్మించనున్నారు.
శర్వానంద్... బిజీ బిజీ
హీరో శర్వానంద్ బిజీ బిజీగా ఉన్నారు. ‘మనమే’ (2024) చిత్రంతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన ప్రస్తుతం మూడుప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్న్స్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. అదే విధంగా శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య, సంయుక్త కథానాయికలు.
అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న 38వ చిత్రం ‘శర్వా 38’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకుడు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.
1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీలో 60ల నాటి పాత్రను పోషించడానికి మేకోవర్ అవుతున్నారు శర్వానంద్. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
సిద్ధు జొన్నలగడ్డ... హుషారుగా...
‘డీజే టిల్లు’ (2022), ‘టిల్లు స్క్వేర్’(2024) వంటి వరుస హిట్స్‌తో జోరుగా హుషారుగా దూసుకెళుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ’జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘తెలుసు కదా’.
ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు ‘టిల్లు క్యూబ్’ కూడా చేయనున్నారు సిద్ధు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే ప్రకటించారు ఆ చిత్రనిర్మాత నాగవంశీ.
పైన పేర్కొన్న కథానాయకులే కాదు... మరికొందరు కూడా మూడుప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకొందరు హీరోల చేతిలో రెండు సినిమాలు ఉండగా మూడో సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్
Comments
Please login to add a commentAdd a comment