
చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్-CSAFF (Chicago South Asian Film Festival)కు మూడు భారతీయ సినిమాలు ఎంపిక అయ్యాయి. ఫ్యాషన్ డిజైనర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మనీష్ మల్హోత్రా నిర్మించిన సాలీ మొహబ్బత్, బన్ టిక్కీ పాటుగా ఘమసాన్ ఎంపిక అయ్యాయి. తాజాగా ఇదే విషయాన్ని ఆయన ప్రకటించారు. జియో స్టూడియోస్ సాయంతో తమ తదుపరి చిత్రాలు CSAFF- 2025లో ప్రదర్శించడం తమకు చాలా గర్వకారణమని మల్హోత్రా చెప్పారు.
టాప్ హీరోయిన్ రాధికా ఆప్టే నటించిన సాలీ మొహబ్బత్ చిత్రం గృహహింస, భావోద్వేగాల నేపథ్యంలో కథ ఉంటుంది. ఈ మూవీకి నటి టిస్కా చోప్రా దర్శకత్వం వహించారు. ఇందులో దివ్యేందు, శరత్ సక్సేనా ప్రముఖ పాత్రలలో నటించారు. 'బన్ టిక్కీ' సినిమా కథ ఏడు సంవత్సరాల శాను అనే చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పిల్లల మనోవికాసం, ప్రేమ వంటి అంశాల చుట్టూ ఉంటుంది. ఘమసాన్ మూవీ గ్రామాణీ కథాంశంతో ఉంటుంది. ఈ మూడు చిత్రాలు జియో స్టూడియో విడుదల చేయనుంది.
2010లో ప్రారంభమైన ఈ ఫిలిం ఫెస్టివల్‌లో భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాల నుండి వచ్చిన ఫీచర్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు ప్రదర్శించబడతాయి