మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ ఫ్రీడమ్‌: హీరో తేజ సజ్జా | Teja Sajja Exclusive Interview with sakshi | Sakshi
Sakshi News home page

మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ ఫ్రీడమ్‌: హీరో తేజ సజ్జా

Jun 15 2025 12:22 AM | Updated on Jun 15 2025 11:41 AM

Teja Sajja Exclusive Interview with sakshi

‘చూడాలని ఉంది, కలిసుందాం రా, గంగోత్రి, ఛత్రపతి’ తదితర చిత్రాలతో బాల నటుడిగా ప్రేక్షకులకు దగ్గరై, ‘ఓ బేబీ’తో లీడ్‌ యాక్టర్‌గా మారి, ఆ తర్వాత చేసిన ‘జాంబిరెడ్డి’తో ఆకట్టుకున్నారు తేజ సజ్జా. ‘హను–మాన్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ ‘ఫాదర్స్‌ డే’ గురించి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఈ విధంగా...

నాకు ఊహ తెలిసినప్పట్నుంచి మా నాన్నగారు వృత్తి రీత్యా బిజీగా ఉండేవారు. కానీ ఆదివారం మాత్రం నన్ను కూడా తనతో పాటు ఆఫీస్‌కు తీసుకుని వెళ్లేవారు. అక్కడ అందరూ పని చేస్తుంటే ఆసక్తిగా గమనించేవాడిని. అలా వెళ్లడం వల్లనో ఏమో నా ఆరేళ్ల్ల వయసుకే స్కూలు, సినిమా షూటింగ్‌లు వంటి పరిసరాల్లో నేను చాలా మామూలుగా ఉండగలిగాను. ఎలాంటి బెదురు లేకుండా షూటింగ్‌ చేసేవాణ్ణి. 

⇒ నా అల్లరి విషయానికొస్తే... ఒకసారి స్కూల్‌ నుంచి మా నాన్నగారికి ఫోన్‌ చేసి, ‘మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు’ అని కంప్లైంట్‌ చేశారు. నాన్న చాలా కూల్‌గా... ‘వాడిని పెంచింది నేను. ఏం చేస్తాడో, ఏం చెయ్యడో నాకు బాగా తెలుసు. మీరేం చెప్పినా నమ్మను. వాడిని అడగను కూడా’ అని ఫోన్‌ కట్‌ చేశారు. నాన్న అంత నమ్మారు కాబట్టి అప్పట్నుంచి ఈరోజు వరకూ నా వల్ల ఆయనకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా జాగ్రత్తగా, 
క్రమశిక్షణతో ఉంటున్నాను. 

⇒ నాన్నకి నేనంటే చాలా నమ్మకం. నా ఇష్టాయిష్టాలకు, నా నిర్ణయాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. చదువు, సినిమాలు... ఇలా నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు. యాక్చువల్లీ నాన్నకు మొదట్లో సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. ఒకటి, రెండు సినిమాలు అయ్యాక నేను షూటింగ్స్‌ను పిక్నిక్‌లా ఎంజాయ్‌ చేస్తున్నానని నన్ను వెళ్లనిచ్చారు. ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ అయ్యాక ధైర్యం చేసి, నాన్న దగ్గరికి వెళ్లి, ‘ఈ చదువు నా వల్ల కావడం లేదు. సినిమా ఇండస్ట్రీకి 
వెళ్తాను’ అనగానే టీవీ చూస్తున్న నాన్న కనీసం తల కూడా తిప్పకుండా ‘సరే నీ ఇష్టం’ అన్నారు. అలా ఒక్క మాట కూడా అడగకుండా నాకు ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకునేలా ప్రోత్సహించేసరికి, ఒక బాధ్యతలా భావించి, పట్టుదలతో పని చేస్తున్నాను. 

⇒ నా లైఫ్‌లో మా నాన్నే నా హీరో. ఒక మామూలు వ్యక్తిగా లైఫ్‌ స్టార్ట్‌ చేసి, తన వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కుటుంబంలో ఉన్న అందరి బాధ్యతలతో పాటు... బంధువుల్లో ఎంతో మందికి చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి వాటికి హెల్ప్‌ చేశారు. 

⇒ మా నాన్నకు కుటుంబం తప్ప వేరే వ్యాపకం లేదు. ఆఫీసు, ఇల్లు, కుటుంబం... ఇదే ఆయన లోకం. చేసే పనిలో నిజాయితీ, 
నిబద్ధత, అంకితభావం ఎలా ఉండాలో నాన్నగారి నుండి నేర్చుకున్నాను. మనం చేసే పనికి నూటికి నూరు శాతం న్యాయం చెయ్యాలని నేర్చుకున్నాను. అలాగే లైఫ్‌లో జరిగే ప్రతీ విషయం గురించి అదే పనిగా ఆలోచించకుండా ‘ప్రశాంతంగా ఉండటం’ అనేది మా నాన్న నుంచి నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. 

⇒ మా నాన్నగారికి ఇప్పుడు 64 ఏళ్లు. ఆయన ఉదయం 5 గంటలకు నిద్రలేచి, గంట వాకింగ్‌ చేస్తారు. తర్వాత ఆఫీసుకు వెళ్లడం. గత 30 ఏళ్లుగా ఇదే దినచర్య. నాకు క్రమశిక్షణ ఉంది కానీ... ఇలాంటి క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. 
⇒ మా నాన్నగారి 60వ పుట్టినరోజు సందర్భంగా నా సం΄ాదనతో ఆయనకి ఒక మంచి కారు కొని, గిఫ్ట్‌గా ఇచ్చాను. అప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఈ ‘ఫాదర్స్‌ డే’కి మా నాన్నగారికి నేను ఇచ్చే గిఫ్ట్‌ అంటే ‘సాక్షి’కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూనే. మా నాన్నగారు ఈ ఇంటర్వ్యూ చదివి, ఇచ్చే రియాక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నాను.    

⇒ నాకు పదేళ్లు వచ్చేసరికి మా నాన్న నాతో ఒక ఫ్రెండ్‌లా బిహేవ్‌ చేయడం మొదలుపెట్టారు. అన్ని రకాల పనులు, విషయాల్లో నా ఒపీనియన్‌ అడిగి తెలుసుకునే వారు. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో నా అబీప్రాయానికి కూడా విలువ ఇచ్చేవారు. నేను చాలా బాధ్యతగా ఉండటానికి అది చాలా ఇన్‌స్పైర్‌ చేసింది.
⇒ నాన్న నాతో చెప్పే చిన్న చిన్న మాటలే నాకు లోతైన అవగాహన కలిగిస్తాయి. నా కెరీర్‌ పరమైన, రోజువారీ విషయాల్లో ఆయన కలుగజేసుకోరు. కానీ ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా ఎలా సాఫ్ట్‌గా మాట్లాడాలో, మనం చెప్పే మాట ఎదుట వ్యక్తికి సులువుగా అర్థమయ్యేలా ఎలా మాట్లాడాలో అప్పుడప్పుడు 
చెబుతుంటారు.

⇒ నా లైఫ్‌లో మా నాన్న నాకు ఇచ్చిన బెస్ట్‌ గిఫ్ట్‌ అంటే... చాలా చిన్న వయసులోనే నాకు సంబంధించినవి నేనే ఎంచుకునే ఫ్రీడమ్‌. వీటివల్లే నేను సొసైటీలో తిరిగి, చాలామంది వ్యక్తులను కలిసి, అన్ని రకాల పరిస్థితులను దగ్గరగా చూసి, ఆలోచించి, అందుకు తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకున్నాను. సినిమా షూటింగ్, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నా నాన్నతో కూర్చుని మాట్లాడతాను. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వరుస సినిమాల వల్ల నిజంగానే నాన్నగారితో ఎక్కువ టైమ్‌ గడపడానికి కుదరడం లేదు. అదో చిన్న లోటులా అనిపిస్తుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement