నమ్మకం ఉంటే మ్యాజిక్‌ జరుగుతుంది: హీరో సూర్య | Suriya Veera Bhadrudu Pre-Release Event | Sakshi
Sakshi News home page

నమ్మకం ఉంటే మ్యాజిక్‌ జరుగుతుంది: హీరో సూర్య

May 12 2026 12:35 AM | Updated on May 12 2026 12:35 AM

Suriya Veera Bhadrudu Pre-Release Event

సుప్రియ యార్లగడ్డ, కార్తీ, వెంకీ అట్లూరి, సూర్య, ఆర్‌జే బాలాజీ

‘‘వీరభద్రుడు’ సినిమా తొలి భాగం మంచి కోర్టు రూమ్‌ డ్రామా. సెకండాఫ్‌ మంచి థియేట్రికల్‌ మాస్‌ మూమెంట్స్‌... ఫన్, హ్యూమర్‌ కూడా ఉంటుంది. ఈ నెల 14న మీ అందరికీ ‘వీరభద్రుడు’ సినిమాతో ఒక మంచి ఎంటర్‌టైనింగ్‌ సినిమాను ఇవ్వబోతున్నామని ప్రామిస్‌ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మమ్మల్ని అతిథుల్లా కాకుండా దత్తపుత్రుల్లా భావిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని సూర్య అన్నారు. సూర్య, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.

తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను రిలీజ్‌ చేయనుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ– ‘‘ఎక్కడైతో నమ్మకం ఉంటుందో ఎక్కడైతే ఆశ ఉంటుందో అక్కడ మ్యాజిక్‌ జరుగుతుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. సమస్యలు వచ్చినప్పుడు గుడికి వెళ్తాను. కానీ ఆర్‌జే బాలాజీ ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్ధిస్తుంటాడు. ఆర్‌జే మంచి యాక్టర్, రైటర్, డైరెక్టర్, గుడ్‌ ఫాదర్, ఫ్రెండ్‌... ఇలా మల్టీ టాలెంటెడ్‌. భావోద్వేగం అయినా, హాస్యం అయినా ఆయన నిజాయితీతో వర్క్‌ చేస్తారు.

సుప్రియగారితో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. ‘వీరభద్రుడు’ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థతో అసోసియేట్‌ కావడం మాకు గౌరవప్రదం. దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో త్రిష–నేను కలిసి నటించాం’’ అన్నారు. 

ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో కార్తీ మాట్లాడుతూ–‘‘వీరభద్రుడు’ మాస్‌ మసాలా అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ సినిమా. అన్నయ్య (సూర్యని ఉద్దేశించి)గారు మాత్రమే చేయగలిగిన సినిమా ఇది. థియేటర్స్‌లో సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సినిమా ‘వీరభద్రుడు’’ అన్నారు.

ఆర్‌జే బాలాజీ మాట్లాడుతూ– ‘‘వీరభద్రుడు’ సినిమా తమిళ ప్రేక్షకుల కోసమే కాదు... తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని తీశాం. మాకు కరుప్పు స్వామి ఎలాగో మీకు వీరభద్రుడు స్వామి అలా. నేనొక దర్శకుడిగా, సూర్యగారు హీరోగా సినిమా చేస్తానని అనుకోలేదు. సూర్యగారు నన్ను నమ్మడం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్‌లో సూర్య సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకుడా? అని కొందరు అన్నారు. టీజర్, ట్రైలర్‌ విడుదలైన తర్వాత నాపై వారికి నమ్మకం కలిగింది’’ అన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి, లిరిక్‌ రైటర్‌–సింగర్, యాక్టర్‌ రాకేందు మౌళి, రచయిత రామజోగయ్య శాస్త్రి, ఫైట్‌ మాస్టర్‌ విక్రమ్‌ మాట్లాడారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ పాల్గొన్నారు.

‘‘ప్రపంచంలో మనల్ని నమ్మేవారు ముందు కొద్ది మందే ఉండొచ్చు. 
రెండు మూడేళ్ల క్రితం తమిళనాడులోని ఒక వ్యక్తిపై విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అతన్ని ఎవరూ నమ్మలేదు. చాలామంది నెగటివ్‌ ప్రచారం చేశారు. కానీ ఆ వ్యక్తి తనను తాను నమ్మాడు. ఇప్పుడు అతను తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యాడు... గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌గారికి తాను మంచి చేయగలనన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకమే లక్షలాది తమిళ ప్రజల్లోకి వెళ్లి, వారి చేత ఓట్లు వేయించింది’’ అని ఆర్‌జే బాలాజీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement