Jayamma Panchayathi Press Meet: నాకు నేను కనిపించలేదు!

Suma Kanakala talks on Jayamma Panchayathi press meet - Sakshi

– సుమ కనకాల

‘‘జయమ్మ పంచాయితీ’కు కేటాయించిన సమయాన్ని టీవీ షోలు, ప్రీ రిలీజ్‌లకు హోస్ట్‌గా చేయడం వంటి వాటికి వినియోగించినట్లయితే మరిన్ని డబ్బులు వచ్చి ఉండేవేమో. కానీ నన్ను నేను
ప్రపంచానికి ఎక్స్‌ప్లోర్‌ చేసుకోవాలను కున్నప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేసినందుకు నాకు నేను శెభాష్‌ చెప్పుకుంటున్నా’’ అని ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల అన్నారు. విజయ్‌ కుమార్‌ దర్శకుడిగా సుమ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. బలగ ప్రకాశ్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సుమ   చెప్పిన విశేషాలు....

‘జయమ్మ పంచాయితీ’ బౌండ్‌ స్క్రిప్ట్‌ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సినిమాలో జయమ్మ క్యారెక్టర్‌ నిడికి తక్కువ ఉంటుందేమోనని ఊహించి, చదవడం మొదలుపెట్టాను. కానీ కథ మొత్తం ఆ పాత్రతోనే నడుస్తోందని స్క్రిప్ట్‌ చదువుతున్న కొద్దీ అర్థం అయ్యింది. అయితే టెలివిజన్‌ షోలు, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లు, ఫ్యామిలీ బాధ్యతలను పక్కన పెట్టి ఈ సినిమా చేయాలా? అని ఒకటికి పదిసార్లు ఆలోచించాను. కానీ చాలెంజ్‌గా తీసుకుని చేశాను.  

అవి నచ్చి ఈ సినిమా చేశా!
కులాలకు సంబంధించిన అంశాలు, మూఢనమ్మకాలు, మహిళల పట్ల వివక్ష వంటి అంశాలను విజయ్‌గారు ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఆ అంశాలు నచ్చి నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. మన ఊర్లో ఎవరైనా ఇంట్లో ఫంక్షన్‌ జరిగితే మనం ఈడ్లు (చదివింపులు) వేస్తాం. జయమ్మకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే జయమ్మ ఎవరికైతే ఈడ్లు వేసిందో వారందరూ తిరిగి వేయాలి. కానీ జయమ్మ ఈడ్లు తీసుకున్నవారికీ కొన్ని సమస్యలు ఉంటాయి. మరి.. జయమ్మ సమస్య ఎలా తీరింది? అన్నదే ఈ చిత్రకథ.

ఎవరూ నిరుత్సాహపడరు
సుమ బాగా యాక్ట్‌ చేసిందని మెచ్చుకుంటారే కానీ నిరుత్సాహపడరనే నమ్మకం ఉంది. ఒకసారి సినిమా స్టార్ట్‌ అయ్యాక అందరూ క్యారెక్టర్స్‌తో ట్రావెల్‌ చేస్తారు. ఎందుకంటే సుమ గురించి ఊహించకుండా విజయ్‌ రాసిన స్టోరీ ఇది. సినిమా చూస్తున్నప్పుడు నాకు నేనే కనిపించలేదు. జయమ్మే కనిపించింది. ఓ ప్రయోగాత్మక సినిమా చేçస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే శ్రీకాకుళం స్లాంగ్‌ కోసం చాలా ప్రాక్టీస్‌ చేశాను. ఈ జయమ్మ పంచాయితీ హిట్‌ అయితే మరో పంచాయితీ ఉంటుంది. నా తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం రెండు కథలు ఉన్నాయి.

రోషన్‌ లాంచ్‌ ఈ ఏడాదే..
నా కుమార్తెకు ఏడెనిమిదేళ్లు ఉన్న సమయంలో చాలా బిజీగా ఉండి వరుసగా మూడు రోజులు నేను తనకు కనిపించలేదు. ఆ సమయంలో ‘నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..’ అని నా కూతురు అడిగింది. ఆ రోజు గుండె పిండేసినట్లయింది. ఇప్పుడు తనకు 16 ఏళ్లు. తన ఆలోచనా ధోరణిలో పరిణతి వచ్చింది. నా కొడుకు రోషన్‌కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే ఆసక్తి. ఈ ఏడాది తనని లాంచ్‌ చేస్తాం.

ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో శ్రీకాకుళంలోని  పాలకొండ, చెన్నైపేట, అక్కడి అటవీ ప్రాంతం.. ఈ లొకేషన్స్‌ను ఎవరూ ఎక్స్‌ప్లోర్‌ చేయలేదు. బహుశా.. ఈ లొకేషన్స్‌లోకి యూనిట్‌ వెళ్లడం, సామాగ్రిని తీసుకుని వెళ్లడం కష్టమని భావించి ఎవరూ ప్రయత్నించలేదేమో కానీ ఈ లొకేషన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. మా ‘జయమ్మ పంచాయితీ’ సినిమా సెకండాఫ్‌లోని కొన్ని సీన్ల కోసం ట్రెక్కింగ్‌ చేసి మరీ ఆ లొకేషన్స్‌కు వెళ్లాం. అక్కడ కొన్ని జలపాతాలూ ఉన్నాయి. శ్రీకాకుళంలో ఎంత అందం ఉందో!  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top